India Vs England Fifth Test : ఓవల్ టెస్ట్ లో ఏం జరగబోతుందో? సిరీస్ ఫలితం తేలనుందా?
భారత్ - ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదో టెస్ట్ లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ మైదానంలో నేటి నుంచి ప్రారంభం కానుంది
భారత్ - ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదో టెస్ట్ లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ మైదానంలో నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ తో సిరీస్ ఫలితం తేలనుంది. ఓవల్ టెస్ట్ డ్రాగా ముగిసినా, ఇంగ్లండ్ గెలిచినా టెస్ట్ సిరీస్ ఇంగ్లండ్ సొంతమవుతుంది. అదే సమయంలో భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ను సమం చేసిటన్లుల అవుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ భారత్ కు కీలకమనే చెప్పాలి. సిరీస్ గెలవడం కోసం ఇంగ్లండ్, మ్యాచ్ ను గెలిచి సిరీస్ డ్రా చేయడం కోసం భారత్ ఈ మ్యాచ్ లో తీవ్రంగా శ్రమిస్తాయి. అయితే టాస్ గెలవడంపైన కూడా గెలుపోటములు ఆధారపడి ఉంటాయని క్రీడానిపుణులు చెబుతున్నారు.
ఇంగ్లండ్ తుది జట్టులో...
ఇంగ్లండ్ విషయానికి వస్తే ఒకరోజు ముందుగానే తన తుది జట్టును ప్రకటించింది. కుడి భుజం గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదో టెస్టును ఆడటం లేదని ప్రకటించింది. బెన్ స్టోక్స్ లేకపోవడం ఒకరకంగా తుది మ్యాచ్ లో ఇంగ్లండ్ కు ఎదురుదెబ్బ. ఎందుకంటే ఇప్పటి వరకూ జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో బెన్ స్టోక్స్ పదిహేడు వికెట్లు తీశాడు. బెన్ స్టోక్స్ స్థానంలో ఐదో టెస్ట్ లో ఓలీ పోప్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఇక లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ ను కూడా తుది జట్టు నుంచి తప్పించింది. వారి స్థానంలో జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జెమీ ఒవర్టన్, జోష్ టెంగ్ లు జట్టులోకి వచ్చారు.
బుమ్రా ఆడటం..
ఇక భారత్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ తుది జట్టును ప్రకటించలేదు. బుమ్రాను ఐదో మ్యాచ్ లో ఆడిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. బుమ్రా స్థానంలో అర్షదీప్ వచ్చే అవకాశాలున్నాయి. బుమ్రాను ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడించాలని బీసీసీఐ ముందుగానే నిర్ణయించింది. ఈ మేరకు మూడు టెస్ట్ లను బుమ్రా ఆడేశాడు. దీంతో ఆకాశ్ దీప్ ను కూడా జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. సిరాజ్ ఎటూ ఆడతాడు కాబట్టి ఎటూ స్పిన్నర్లు జడేజా, వాషింగ్టన్ సుందర్ లు ఉండనే ఉండనున్నారు. బ్యాటర్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మొత్తం మీద ఐదో టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేయాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.