IPL 2025 Finals : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం .. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
ఈరోజు ఐపీఎల్ ఫైనల్స్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ కు మంచి కిక్కు దొరుకుతుంది.
దేశమంతా క్రికెట్ కోలాహలం. ఈరోజు ఐపీఎల్ ఫైనల్స్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ కు మంచి కిక్కు దొరుకుతుంది. అయితే ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ ఫైనల్స్ ను చూసేందుకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుండటంతో క్రికెట్ టెన్షన్ మొదలయింది. ఇప్పటికే పలు చోట్ల ఫ్యాన్స్ రాత్రికి క్రికెట్ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీంతో పాటు ప్రయివేటు సంస్థలు కూడా ముందుకు వచ్చి ఫైనల్స్ ను మరింత గా ఫ్యాన్స్ కు దగ్గరగా చేర్చే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇక బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్ లో పెద్ద పెద్ద ఎల్.సి.డి స్క్రీన్లు పెట్టారు.
ఆఫర్లతో ఆకట్టుకుంటూ...
వచ్చిన వారందరికీ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. బార్లలో కూడా ఆఫర్లు ఉండటంతో పెద్దయెత్తున ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మద్యంలోనూ, ఫుడ్ లోనూ ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల ఈ రకమైన బోర్డులు కనిపిస్తున్నాయి. ముందుగా టేబుల్స్ బుక్ చేసుకునేందుకు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఓపెనింగ్ ప్రారంభమయింది. అలాగే ఇదే సమయంలో భారీ ఎత్తున క్రికెట్ బెట్టింగ్ లు జరిగే అవకాశముండటంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అనుమానితులపై నిఘా పెట్టారు. బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఫైనల్ మ్యాచ్ కోసం...
ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుస్తుందని పెద్దయెత్తున బెట్టింగ్ లు జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో అప్రమత్తమైన ప్రత్యేక బృదాలు దానిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు అనేక క్లబ్ లు కూడా ప్రవేశరుసుము పెట్టి ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో కొందరు అటువైపు వెళుతున్నారు. బిగ్ స్క్రీన్ మీద ఐపీఎల్ ఫైనల్స్ ను తిలకించేలా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ప్రముఖ హోటల్స్, క్లబ్ లు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పోలీసులు వాటిపై కూడా నిఘా ఉంచారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ ఫీవర్ మొదలయిందనే చెప్పాలి.