India vs Pakisthan : పోటుగాళ్లని ప్రచారం.. మనోళ్లు ఏ మాత్రం భయపడలేదుగా

పాక్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనడం కూడా కష్టమని అందరూ అన్నారు. కానీ భారత్ బ్యాటర్లు ఏ మాత్రం భయపడలేదు

Update: 2025-02-24 04:11 GMT

భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ నిన్న చూసిన వారికి ఒక విషయం అర్థమై ఉండాలి. పాకిస్థాన్ తోపు గాళ్లని ప్రచారం చేసుకుంది. పాక్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనడం కూడా కష్టమని అందరూ అన్నారు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను మనోళ్లు తట్టుకోగలరా? అని అనేక అనుమానాలు తలెత్తాయి. అన్ని సందేహాలకు మనోళ్లు చెక్ పెట్టేశారు. యాభై ఓవర్లలో ఎవరికీ పెద్దగా భయపడలేదు. రోహిత్ శర్మ నుంచి అక్షర్ పటేల్ వరకూ ఎవరూ పెద్దగా ఫాస్ట్ బౌలర్లను చూసి జడసుకోలేదు. తత్తరపాటుకు గురి కాలేదు. ఉన్న కాసేపు కూడా షాట్లు కొట్టి ఇదిరా మా దెబ్బ అన్నట్లు చూశారు.

కట్టడి చేయాలనుకున్నా...
ఫాస్ట్ బౌలర్లు షషిన్ షా ఆఫ్రదీ, నసీమ్ షా, రవూఫ్ లు భారత్ బ్యాటర్లను కట్టడి చేయాలని ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. షషిన్ షా బౌలింగ్ లో మనోళ్లు ఉతికి ఆరేశారు. ఫోర్లు కొట్టారు. వరస ఫోర్లతో అంతటి ఫాస్ట్ బౌలర్ ను కూడా వత్తిడికి గురి చేయడంలో భారత్ బ్యాటర్లు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. షషిన్ షా ఎనిమిది ఓవర్లు వేసి 74 పరుగులు ఇచ్చాడు. నసీమ్ షా బౌలింగ్ లో కూడా పెద్దగా భీతిల్లకుండానే భారత్ బ్యాటర్లు బాదుడు బాదేశారు. ఎనిమిది ఓవర్లలో నసీమ్ 37 పరుగులు సమర్పించుకున్నాడు. రవూఫ్ ఏడు ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చాడు.
అబ్రార్ ఓవర్ యాక్షన్...
ఇక స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఓవర్ యాక్షన్ చేశాడు. నలభై ఆరు పరుగుల వద్ద శుభమన్ గిల్ అవుట్ కావడంతో వెళ్లిరా అంటూ సైగలు చేయడం భారత్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అబ్రార్ బౌలింగ్ లో పది ఓవర్లు వేసి ఇరవై ఎనిమిది పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ తీసుకున్నాడు. అంటే పాకిస్థాన్ బౌలింగ్ పై భయపెట్టినంత ఏమీ లేదన్నది ఈ మ్యాచ్ తో తేలిపోయింది. శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఉన్నంత సేపు పాకిస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశారు. అదే ప్రచారం ఒకటి.. మైదానంలో కనిపించింది మరొకటి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News