IPL 2025 : లక్నో కు మళ్లీ లక్కు ముఖం చాటేసింది.. ఢిల్లీకి విక్టరీ తెచ్చిపెట్టింది
లక్నోలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మీద విజయం సాధించింది
ఐపీఎల్ లో ఈసారి గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ కాపిటల్స్ కు వరస విజయాలు దక్కుతున్నాయి. ఓటములు తక్కువ. విజయాలు ఎక్కువ కావడంతో సులువుగా ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు ఈ రెండు జట్లు మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాయి. సమిష్టిగా రాణిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మిగిలిన రెండు స్థానాల కోసమే మిగిలిన జట్లు పోటీ పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఈ సీజన్ లో ఏమాత్రం అంచనా లేకుండా వచ్చి విజయ పథంలో దూసుకుపోతుంది. నిన్న లక్నోలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మీద విజయం సాధించింది
ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చినా...
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ లో ఓపెనర్లు మార్ క్రమ్, మిచెల్ మార్ష్ లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మార్ క్రమ్ చెలరేగి ఆడి 52 పరుగులు చేసి అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ 45 పరుగుల వద్ద వెనుదిరిగాడు. పూరన్ బ్యాడ్ లక్ తో పెవిలియన్ బాట పట్టాడు. సమద్ రెండు పరుగులుకే అవుటయ్యాడు. మిల్లర్ నాటౌట్ గా నిలిచి పథ్నాలుగు పరుగుుల, ఆయుష్ బదోని 36 పరుగులు చేశాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ మొత్తం ఇరవై ఓవర్లకు గాను ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ కాపిటల్స్ బౌలర్లలో స్టార్క్ ఒకటి, ముఖేశ్ కుమార్ నాలుగు వికెట్లు తీయడంతో పాటు చమీర ఒక వికట్ తీయడంతో కోల్ కత్తా కథ ముగిసినట్లయింది.
నింపాదిగా ఆడుతూ...
తక్కువ స్కోరు కాబట్టి ఢిల్లీ కాపిటల్స్ జట్టు నింపాదిగా ఆడే అవకాశం లభించింది. అసలే మంచి ఫామ్ లో ఉన్నటీం కావడంతో ఈ స్కోరును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని అందరికీ తెలుసు. అందుకే అందరి అంచనాలకు తగినట్లుగానే ఓపెనర్ గా దిగిన అభిషేక్ పోరెల్ 57 పరుగులు చేశాడు. కరుణ్ నాయర్ పదిహేను పరుగుల వద్ద అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను విజయం వైపు నడిపించాడు. కేఎల్ రాహుల్ యాభై ఏడు పురుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 34 పరుగులు చేసి జట్టును విజయ పథాన నడిపించాడు. ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఈ స్కోరును కేవలం 17.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది