India vs Pak T20 World Cup : భారత్ పై ఓటమితో పాక్ పై సొంత దేశంలో దుమారం.. బాయ్ కాట్ చేయాల్సిందంటూ?

టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో భారీ పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమి పాలవడంతో ఆ దేశ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది

Update: 2026-02-17 01:52 GMT

టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో భారీ పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమి పాలవడంతో ఆ దేశ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. కొలంబోలో ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ తర్వాత మాజీ కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు సీనియర్ ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు మాజీ క్రికెటర్లు అతడిని టీ20 జట్టులోంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కూడా పాక్ టీంపై ధ్వజమెత్తుతున్నారు. పాక్ ఆటగాళ్లు భారత్ పై ఎన్నడూ చూడని ఆటని చూపించారని సెటైర్లు వేస్తున్నారు. ఈ ఏకపక్ష మ్యాచ్‌లో బాబర్‌తో పాటు సీనియర్ స్పిన్నర్ షాదబ్, ప్రధాన పేసర్ షాషీన్ షా ఆఫ్రిదీ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయారు. పాకిస్థాన్ బౌలింగ్‌ను యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ వీర విహారాన్ని అదుపు చేయలేకపోవడం పాక్ జట్టు వైఫల్యమేనంటున్నారు. ఆప్ఘనిస్తాన్, బలూచిస్తాన్ లోనూ పాక్ కు వ్యతిరేకంగా సంబరాలు చేసుకున్నారు.

సీనియర్లు వరస బెట్టి...
మరొకవైపు భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా అక్షర్ బౌలింగ్‌లో బాబర్ ఐదు పరుగులకే ఔటయ్యాడు. 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ జట్టు 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో అతడు నెమ్మదిగా ఆడే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు. మాజీ కెప్టెన్ షాషిద్ ఆఫ్రిది తీవ్రంగా స్పందించాడు. తన చేతిలో ఉంటే బాబర్, షాదాబ్, షాహీన్‌లను మళ్లీ టీ20 జట్టులోకి ఎంచుకోనని, పాకిస్థాన్ తరఫున తమ సామర్థ్యాన్ని చూపేందుకు చాలాసార్లు అవకాశం దక్కిందని, కానీ మళ్లీ విఫలమయ్యారని అన్నాడు. ఈ ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లను తయారు చేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు. సీనియర్లను సాగనంపి జూనియర్లను జట్టులోకి తేవాల్సిందేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అసలే ఓటమితో కుంగిపోయి ఉన్న పాక్ జట్టుకు సొంత దేశం నుంచి ఎదురవుతున్న వత్తిడి రానున్న మ్యాచ్ లపై పడే అవకాశముండనుంది.
యువ ఆటగాళ్ల అవసరం...
మాజీ కెప్టెన్ మియాందాద్ కూడా ఒత్తిడి వల్ల పాక్ జట్టు పోరాడలేకపోతోందని అంగీకరించాడు. మరో మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ కూడా ఈ పరాభవంతో బాబర్, షాహీన్ టీ20 కెరీర్ ముగియాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. షాహీన్, బాబర్, షాదాబ్ సమయం ముగిసింది. బలహీన జట్లపై ఖాళీ విజయాలు కాదు, యువ ఆటగాళ్ల అవసరం జట్టు ఉందని ఎక్స్‌లో పోస్టు చేశాడు. మాజీ పేసర్ షోయబ్ కూడా బాబర్ స్టార్ ఇమేజ్‌పై వ్యంగ్యంగా స్పందించాడు. ఈ ఓటమితో పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో నిరాశ నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో కూడా జట్టుపై వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఇచ్చిన బహిష్కరణ పిలుపును ప్రభుత్వం పాటించి ఉంటే బాగుండేదని కొందరు పోస్టులు చేశారు.


Tags:    

Similar News