Asian Cup : ఆసియా కప్ ఆరంభం కాకముందే బెట్టింగ్ రాయుళ్ల జోరు
ఆసియా కప్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఛాంపియన్ గా ఎవరు నిలుస్తారన్న దానిపై ఇంకా బెట్టింగ్ లు జోరందుకున్నాయి
ఆసియా కప్ ఛాంపియన్ ట్రోఫీ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఛాంపియన్ గా ఎవరు నిలుస్తారన్న దానిపై ఇంకా బెట్టింగ్ లు జోరందుకున్నాయి. ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా బెట్టింగ్ లు పెద్ద సంఖ్యలో నడుస్తున్నట్లు సమాచారం. ఆసియా కప్ ప్రారంభం కాకముందే బెట్టింగ్ లు ఊపందుకోవడంతో పోలీసు శాఖ దానిపై దృష్టి పెట్టింది. ప్రధానంగా గెలిచే టీంలపైనే ఎక్కువగా బెట్టింగ్ లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రత్యేక టీంలు బెట్టింగ్ బాబుల భరతం పట్టేందుకు రంగంలోకి దిగినట్లు తెలిసింది.
ఐపీఎల్ తో మొదలు పెడితే...
క్రికెట్ మ్యాచ్ అందులోనూ టీ20 మ్యాచ్ జరుగుతుందంటే ఎక్కడైనా బెట్టింగ్ లు ఊపందుకుంటాయి. భారత్ లోనూ అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ బెట్టింగ్ ల జోరు ఎక్కువగా ఉంటుంది. ఐపీఎల్ నుంచి మొదలు పెడితే ఏ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా బెట్టింగ్ రాయుళ్లు రెచ్చి పోతుంటారు. కోట్లాది సొమ్ములు క్షణాల్లో మాయమవుతాయి. ఈసారి ఆసియా కప్ కావడంతో అధికంగా బెట్టింగ్ లు జరిగే అవకాశముందని అంచనా వేసిన పోలీసు అధికారులు ఆ మేరకు నిఘాను తీవ్రతరం చేసినట్లు తెలిసింది.
భారత్ ఆటగాళ్లపైనే...
ప్రధానంగా ఈ సారి ఛాంపియన్ ట్రోఫీని ఎక్కువగా భారత్ ముద్దాడుతుందని బెట్టింగ్ లు జరుగుతున్నాయని తెలిసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కు కూడా అవకాశాలు లేకపోలేదన్న అంచనాలతో ఆటీంపై కూడా కొందరు భారీగానే బెట్టింగ్ లు పెడుతున్నారు. తర్వాత శ్రీలంకపైన కూడా కొందరు బెట్టింగ్ లు వేస్తున్నారని తెలిసింది. మరొకవైపు సిక్సర్లు, సెంచరీలు, అర్థ సెంచరీలపైన కూడా భారత ఆటగాళ్ల పై ఎక్కువగా బెట్టింగ్ లు జరుగుతున్నట్లు పోలీసులకు ఉప్పందడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక టీంలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా, 14వ తేదీన జరిగే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పై ఎక్కువగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి.