మహిళా అంపైర్‌ పై అశ్విన్ ఆగ్రహం

తమిళనాడు ప్రిమియర్‌ లీగ్‌ లో భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారి తీసింది.

Update: 2025-06-10 09:00 GMT

తమిళనాడు ప్రిమియర్‌ లీగ్‌ లో భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారి తీసింది. మహిళా అంపైర్‌ వెంకటేశన్‌ కృతిక నిర్ణయంపై అశ్విన్‌ కోపాన్ని ప్రదర్శించాడు. దిండిగల్‌ డ్రాగన్స్, తిరుప్పూర్‌ తమిళియన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. డ్రాగన్స్‌ కెప్టెన్‌ అశ్విన్‌ ఇన్నింగ్స్‌ 5వ ఓవర్లో అయిదో డెలివరినీ స్వీప్‌ ఆడగా బంతి ప్యాడ్లను తాకింది. అశ్విన్‌ సింగిల్‌ కోసం పరుగెత్తగా బౌలర్‌ సాయి కిషోర్ అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ కృతిక ఔటిచ్చింది.

లెగ్‌ స్టంప్‌ ఆవల బంతి పిచ్‌ అయినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అప్పటికే వైడ్‌ల కోసం రివ్యూలను వాడుకోవడంతో థర్డ్ అంపైర్ దగ్గరకు వెళ్లలేకపోయారు. అశ్విన్‌ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. మైదానాన్ని వీడుతూ అశ్విన్‌ సహనం కోల్పోయాడు. బ్యాటును బలంగా తన ప్యాడ్లపై కొట్టుకున్నాడు. బౌండరీ లైన్‌ దగ్గరికి రాగానే గ్యాలరీలోకి గ్లోవ్‌ను విసిరికొట్టాడు. ఈ మ్యాచ్‌లో తిరుప్పూర్‌ 9 వికెట్ల తేడాతో డ్రాగన్స్‌ను ఓడించింది.

Tags:    

Similar News