1983 వరల్డ్ కప్ విజయానికి 40 ఏళ్ళు

1983 వరల్డ్ కప్ ఫైనల్లో అండర్ డాగ్‌గా బరిలో దిగిన భారత జట్టు.. ఎవరూ ఊహించని విధంగా ఫైనల్ చేరింది. భయంకరమైన విండీస్‌తో

Update: 2023-06-25 05:38 GMT

లార్డ్స్‌లో ప్రపంచ కప్ ట్రోఫీని పట్టుకున్న కపిల్ దేవ్ చిత్రం ప్రతి భారతీయ క్రికెట్ అభిమానికి జ్ఞాపకమే..! ఈ టోర్నమెంట్ ముందు వరకూ క్రికెట్ అంటే ఏదో ఒక ఆట అని అనుకునేవాళ్లం.. కానీ ఒక్క విజయం భారత్ లో క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. క్రికెట్ ఆటను భారతీయులు కూడా ఎంతో సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. నలభై సంవత్సరాల క్రితం, కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు అసమానతలను ధిక్కరించి, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్‌లో ఎంతో శక్తివంతమైన వెస్టిండీస్‌ను ఓడించి క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అప్పట్లో ప్రపంచకప్‌లో పాల్గొన్న 8 దేశాల్లో ఏ ఒక్కటీ భారత్‌ ప్రపంచకప్‌ గెలుస్తుందని ఊహించలేదు. కానీ అన్ని దేశాలకు షాక్ ఇచ్చి.. కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ ప్రపంచకప్ సాధించింది. అయితే ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్‌కు ఎదురైన అవమానాలు ఒకటి రెండు కాదు. ఇండియాతో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు కూడా అంతే దారుణంగా ఉండేది. మన వాళ్లకు మంచి హోటల్ రూమ్స్ ఇచ్చే వాళ్లు కాదు.. సరైన భోజనం పెట్టేవాళ్లు కాదు.. ఇలా ఎన్నో కష్టాలను అధిగమించి భారత్ వరల్డ్ కప్ గెలిచి నిలిచింది.

1983 వరల్డ్ కప్ ఫైనల్లో అండర్ డాగ్‌గా బరిలో దిగిన భారత జట్టు.. ఎవరూ ఊహించని విధంగా ఫైనల్ చేరింది. భయంకరమైన విండీస్‌తో తలపడేందుకు పసికూనగా పేరు ఉన్న భారత్ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పెద్దగా రాణించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ (38), మొహిందర్ అమర్‌నాథ్ (26), సందీప్ పాటిల్ (27) మాత్రమే రాణించారు. నిర్ణీత 60 ఓవర్లలో భారత జట్టు కేవలం 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్కోరు చూసిన వాళ్లంతా విండీస్ విజయం ఖాయమని అనుకున్నారు. భారత బౌలర్లు నౌ ఆర్ నెవర్ అనే రీతిలో విజృంభించడంతో షాక్ అవ్వడం విండీస్ బ్యాట్స్మెన్.. కాదు కాదు.. క్రికెట్ ప్రపంచం వంతు అయింది. మొహిందర్ అమర్‌నాథ్ కేవలం 12 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. మదన్ లాల్ కూడా 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. లెజెండరీ బ్యాటర్ వివ్ రిచర్డ్స్ (33), జెఫ్ డూయోన్ (25) తప్ప ఎవరూ భారత బౌలింగ్ లైనప్ ముందు నిలబడలేకపోయారు. బల్వీందర్ సంధూ రెండు వికెట్లు, రోజర్ బిన్నీ, కపిల్ దేవ్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో వెస్టిండీస్ కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్రికెట్‌లో భారత్ అందుకున్న తొలి వరల్డ్ కప్ కావడంతో భారత్ లో సెలెబ్రేషన్స్ తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ టోర్నమెంట్ తర్వాత భారత్ లో క్రికెట్ మరో స్థాయికి వెళ్ళింది.


Tags:    

Similar News