India Vs South Africa : క్లీన్ స్వీప్ చేయాలని దక్షిణాఫ్రికా.. పరువు నిలుపుకోవాలని భారత్
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడంతో ఈ పరాజయాన్ని భారత్ మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ల ధాటికి విలవిలలాడిన భారత బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.
ఇప్పటికే ఆధిక్యతతో...
దీంతో దక్షిణాఫ్రికా 1-0తో సిరీస్ పై ఆధిక్యతతో నిలిచింది. రెండో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని దక్షిణాఫ్రికా తహతహలాడుతుంది. అదే సమయంలో ఈ మ్యాచ్ ను గెలిచి సొంత గడ్డపై పరువు నిలుపుకోవాలని భారత్ పరితపిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బౌలర్లను కంటిన్యూ చేస్తూ బ్యాటర్లను కొందరిని పక్కన పెట్టాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కెప్టెన్ శుభమన్ గిల్. గాయంతో బాధపడుతున్న గిల్ ను రెండో మ్యాచ్ లో పక్కన పెట్టే అవకాశాలున్నాయి.
బ్యాటర్లను పక్కన పెట్టి...
అదే సమయంలో వాషింగ్టన్ సుందర్ ను కూడా పక్కన పెడతారంటున్నారు. తొలి టెస్ట్ లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీం ఇండియా ఈసారి ముగ్గురితోనే సరిపెట్టాలని భావిస్తుంది. దేవదత్ పడిక్కల్ ను గిల్ స్థానంలో తీసుకునే అవకాశముంది. అలాగే వాషింగ్టన సుందర్ ను కొనసాగించాలంటే అక్షర్ పటేల్ పై వేటు పడే అవకాశముంది. అదే సమయంలో ఆల్ రౌండర్ గా తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ దక్కవచ్చు. అలాగే సాయి సుదర్శన్ ను కూడా జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.