India vs South Africa : నేటి నుంచి భారత్ - దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్
నేటి నుంచి భారత్ - దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది
నేటి నుంచి భారత్ - దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలుపు భారత్ కు అవసరం. సొంత గడ్డపై సిరీస్ కోల్పోకూడదనుకుంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఒక విధంగా చెప్పాలంటే భారత్ కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పాలి. కోల్ కత్తా మ్యాచ్ లో ముప్ఫయి పరుగుల తేడాతో ఓటమిపాలయిన భారత ఈ మ్యాచ్ లో ఎలా తిరిగి పుంజుకుంటుందన్నది మాత్రం అభిమానుల్లో ఆందోళనగా ఉంది. పిచ్ కొంత పేసర్లకు అనుకూలంగా ఉంటుందంటున్నారు.
గిల్ స్థానంలో...
ఈ మ్యాచ్ కు కెప్టెన్ శుభమన్ గిల్ దూరమయ్యాడు. అతను మెడనొప్పితో గాయపడటంతో పాటు ఫిట్ నెస్ పరీక్షలో పాస్ కాకపోవడంతో ఆయనను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరిస్తాడు. జట్టులో కొన్ని మార్పులు కూడాజరిగే అవకాశముంది. శుభమన్గిల్ స్థానంలో సుదర్శన్ కు చోటు దక్కే అవకాశముందని తెలుస్తోంది. అయితే సుదర్శన్ ను ఆరో స్థానంలో వచ్చే అవకాశముంది.గతంలో మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. ఇప్పుడు ఆరో స్థానంలో ఆడించే ఛాన్స్ ఉంది.
కొన్ని మార్పులతో...
ఇక వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ గా పరవాలేదనిపించుకుంటుండటంతో కొనసాగించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇక తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకుంటారా? లేదా? అన్నది కూడా సంశయంగానే ఉంది. నలుగురు స్పిన్నర్లతో ఆడితే నితీశ్ కు అవకాశం దక్కకపోవచ్చు.ముగ్గురు స్పిన్నర్లను మాత్రమే తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నితీశ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ దక్కనుంది. మొత్తం మీద ఈ మ్యాచ్ లో భారత్ కు గెలుపు అవసరం. దక్షిణాఫ్రికాకు మాత్రం క్లీన్ స్వీప్ చేయాలని తపనతో ఉంది. చూడాలి ఈ మ్యాచ్ ఎవరిని వరిస్తుందో?