సర్వేల్లో పూర్ రిజల్ట్

వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు ఈసారి టిక్కెట్ వచ్చే అవకాశం కన్పించడం లేదు

Update: 2023-09-27 05:38 GMT

సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు ఈసారి టిక్కెట్ వచ్చే అవకాశం కన్పించడం లేదు. మంత్రిగా ఉన్నా, మాటకారి అయినప్పటికీ ఆయనకు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ దక్కడం కష్టమేనని అందుతున్న సమాచారం. ధర్మాన ప్రసాదరావును ఈసారి అసెంబ్లీకి కాకుండా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారు. హైకమాండ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నిన్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం సమీక్షలో భాగంగా జగన్ చేసిన వ్యాఖ్యలతో టిక్కెట్ గల్లంతయిన వారిలో ధర్మాన ప్రసాదరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు ఈసారి టిక్కెట్ దక్కకపోవచ్చన్న అభిప్రాయం పార్టీలోనూ వ్యక్తమవుతుంది.

ఆయన వ్యాఖ్యలు కూడా...
అందుకే ఆయన ఇటీవల కొంత నిర్వేదంతో వ్యాఖ్యలు చేస్తున్నారనిపిస్తుంది. ఫ్యాన్ గుర్తు ప్రజల్లో మరింతగా తీసుకెళ్లాలనడం, మగవాళ్ల కంటే మహిళలే బెటర్ అని వ్యాఖ్యానించడం, గత నాలుగేళ్లుగా పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయారని వ్యాఖ్యానించడం వంటివి ఫ్రస్టేషన్ లో నుంచి వచ్చినవేనన్నది వాస్తవం. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదన్న సంకేతాలు అందడటంతోనే ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని చెబుతున్నారు. ఆయన సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ ప్రతికూల ఫలితాలు రావడంతోనే నిర్వేదంతోనే ఆయన తరచూ పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా అనుకోవాల్సి ఉంటుంది.
వెనకబడి ఉండటంతో...
జగన్ తాజాగా చేయించిన సర్వేల్లోనూ ధర్మాన ప్రసాదరావు పూర్తిగా వెనకబడి ఉన్నారని చెబుతున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ టీడీపీ బలంగా ఉంది. గుండ కుటుంబం ధర్మాన ప్రసాదరావుకు ప్రత్యర్థిగా ఉంది. ధర్మానపై అవినీతి ఆరోపణలు పెద్దగా లేకున్నా భూములు ఆక్రమించుకోవడం, అభివృద్ధి పనులు చేపట్టకపోవడం వంటి వాటితో వెనకబడ్డారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన పనితీరులో మార్పు లేకపోవడంతో పాటు ప్రజల్లో వ్యతిరేకత పెరగడం వల్లనే ఈసారి టిక్కెట్ దక్కడం కష్టమని అంటున్నారు.
ఏదో ఒక పదవి...
నిజానికి ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు పార్టీకి అవసరం. ఏదైనా సబ్జెక్ట్‌ మీద కమాండ్‌తో మాట్లాడగలిగిన నేత. ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటుంది. అటువంటి నేత ఇప్పుడు ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. జగన్ చేయించిన మూడు, నాలుగు సర్వేల్లోనూ ధర్మాన ప్రసాదరావు వెనకబడి ఉండటంతో ఆయనను ఈసారి అక్కడి నుంచి తప్పించడం ఖాయమని చెబుతున్నారు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు మనోహర్ నాయుడికి టిక్కెట్ ఇస్తారా? లేదా? మరెవరికైనా ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ధర్మాన ప్రసాదరావును మాత్రం ఇప్పుడున్న సమాచారం మేరకు పార్లమెంటుకు పోటీ చేయించడమా? లేక మరో నామినేటెడ్ పదవి ఇవ్వడమా? అన్నది ఇంకా తేలలేదన్నది ఫ్యాన్ పార్టీ ద్వారా అందుతున్న సమాచారం. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి మరి.
Tags:    

Similar News