TDP : సత్తా ఉన్నోళ్లకు సీటు ఈసారి కష్టమేనట.. అసలు రీజన్ ఇదే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు

Update: 2024-02-02 08:20 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఆయన కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోనే ఉండి జాబితాను రూపొందిస్తున్నారు. జనసేన సీట్లను పక్కన పెట్టి పక్కాగా తమకు కేటాయించుకునే స్థానాలపై ఆయన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ వర్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికలతో పాటు రాబిన్ శర్మ టీం అందించిన సర్వే రిపోర్టులు దగ్గరపెట్టుకుని మరీ ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి? ఎవరిని పక్కన పెట్టాలి? అన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. తొలి విడతలో డెబ్బయి సీట్లలో అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. పొత్తులో ఉన్న పార్టీలకు ఇబ్బంది లేకుండా ఈ సీట్లను ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. పది పార్లమెంటు స్థానాలపై కూడా ఆయన ఒక క్లారిటీకి వచ్చారని చెబుతున్నారు.

ఆ స్థానాలే కోరుకుంటే...
అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ముగ్గురికి టిక్కెట్లు డౌటేనని అంటున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు గెలవగా అందులో నలుగురు వైసీపీకి మద్దతుదారులుగా మారిపోయారు. శాసనసభలో తనకు జరిగిన అవమానాన్ని సహించలేక బహిష్కరించి బయటకు వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తానని ప్రకటించారు. అయితే ఇప్పుడు జనసేనతోనే సమస్య వచ్చింది. జనసేన కోరుకునే స్థానాలలో తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. వారిని ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నారు. వారిని వేరే చోటకు పంపాలా? లేదా పార్లమెంటు నుంచి పోటీ చేయించాలా? అన్న దానిపై కసరత్తులు చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో తనను నమ్ముకుని ఉండి, ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడకుండా ఉన్న నేతలకు టిక్కెట్
మూడు అక్కడే...
ఈ మూడు నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉండటం విశేషం. మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఈ మూడు స్థానాల్లో జనసేన గట్టిగా ఉండటం, అక్కడ ఆ పార్టీకి బలమైన నేతలు ఉండటంతో ఖచ్చితంగా ఆ స్థానాలను జనసేన కోరనుంది. అందుకే ఇప్పుడు ఆ ముగ్గురి విషయంలోనూ ఎలా అన్న దానిపై ఆయన తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది. రాజమండ్రి రూరల్, పెద్దాపురం, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగ్ లు తమ సీట్లను కోల్పోయే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ మూడు స్థానాలను జనసేనకు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న దానిపై కూడా చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారని తెలిసింది.
ఈ ముగ్గురినీ...
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెద్దాపురం నియోజకవర్గం నుంచి చిన రాజప్ప, ఉండి నియోజకవర్గం నుంచి మంతెన రామరాజులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలలోనూ వారు గెలిచారు. అంటే సత్తా ఉన్నోళ్లు కిందే లెక్క. అందుకే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రాజమండ్రి పార్లమెంటు నుంచి పోటీచేయించాలన్న ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నారు. చినరాజప్ప నమ్మకమైన నేత కావడంతో అధిదకారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పే వీలుందని అంటున్నారు. ఇక ఎటొచ్చీ ఉండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే రామారాజు ను ఏం చేయాలన్న దానిపైనే చంద్రబాబు నేతల నుంచి అభిప్రాయం తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఇందులో ఒకటి మాత్రం పవన్ ను తాము గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను పొత్తులో భాగంగా కోరుకునేలా చూడటం ఒక ఆప్షన్. లేదని పవన్ పట్టుబడితే తప్పించడం మినహా మరో మార్గం మాత్రం టీడీపీ అధినేత వద్ద లేదు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News