Chandrababu : వేచి చూస్తే నష్టమే..వేటు వేయడం ఖాయమే..బాబు డెసిషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అయితే వేటు ఏ రూపంలో ఉంటుంది? ఎవరిపై ఉంటుందన్న చర్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జోరుగా జరుగుతుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించారు. గతంలో నలభై మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిని చంద్రబాబు వ్యక్తం చేశారు. ఆ నలభై మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు పిలిచి వన్ టు వన్ మాట్లాడారు. పనితీరు మెరుగు పర్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష జరిపారు.
అనేక కారణాలతో..
ఎమ్మెల్యేలు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, తమ వ్యాపారాలకే పరిమితం కావడంతో పాటు నియోజకవర్గంలో ఇసుక, మద్యం వంటి వాటిల్లో ఆరోపణలు ఎదుర్కొనడం వంటి వాటిపై కేంద్ర పార్టీ నుంచి మాత్రమే కాకుండా నిఘా వర్గాల ద్వారా నివేదికను తెప్పించుకున్నారు. ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకపోతే, వారిపై ప్రజల్లో అసంతృప్తి పెరిగితే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం కష్టమని భావించి ఎమ్మెల్యేల పనితీరుపైనే చంద్రబాబు ఎక్కువ ఫోకస్ పెట్టారు. తన తెలుగుదేశం పార్టీకి చెందిన 130 మందికి పైగా ఎమ్మెల్యేల్లో నలభై మందిపై ప్రజలు పెదవి విరుస్తున్నారని, ఆ నియోజకవర్గాల్లో పా్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని గుర్తించారు.
నష్ట నివారణ చర్యల్లో భాగంగా...
నష్ట నివారణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లయినా పార్టీ పనితీరును మార్చుకోని నలభై మంది ఎమ్మెల్యేలను గుర్తించి తిరిగి వారి పనీతీరును సమీక్షించిన చంద్రబాబు అందులో నలుగురు మాత్రం పార్టీ లో ఉంటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అని భావిస్తున్నారు. దీంతో ఆ నలుగురిపై చర్యలు తీసుకోవాలని సిద్ధమయ్యారు. కోస్తా జిల్లా నుంచి ఇద్దరు, రాయలసీమ జిల్లా నుంచి ఒకరు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరొకరు ఈ వేటు పడే వారిలో ఉన్నట్లు సమాచారం. వీరికి ఫైనల్ వార్నింగ్ కూడా పూర్తి కావడంతో ఇక ఉపేక్షించి లాభంలేదని భావించిన చంద్రబాబు త్వరలోనే ఆ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసి, ఆ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ ఛార్జులను నియమిస్తారన్న టాక్ పార్టీలో బాగా నడుస్తుంది. ఆ నలుగురు ఎవరన్న దానిపైనే ఇప్పుడు టీడీపీలో ఉత్కంఠ నెలకొంది.