Chandrababu : ఆశలన్నీ ఆ సీట్లపైనేనా...? అధికారం ఖచ్చితమని నమ్ముతుంది అందుకేనా?

శాసనసభ ఎన్నికలకు టీడీపీ సమాయత్తమవుతుంది. ఒక ప్లాన్ ప్రకారం ఈ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు

Update: 2024-01-19 06:49 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతుంది. అయితే ఒక ప్లాన్ ప్రకారం ఈ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. నలభై ఐదేళ్ల తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆయన అన్ని కోణాల్లో పార్టీని విజయం వైపు నడిపించాలని సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇటు పొత్తులను ఖరారు చేసుకోవడంతో పాటు అటు అభ్యర్థుల ఎంపికపైన కూడా దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో చేరికలకు ప్రాధాన్యం ఇస్తూనే మరోవైపు వారికి టిక్కెట్లు ఇవ్వడంలో మాత్రం ఎలాంటి హామీలు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీ కష్టకాలంలో నమ్ముకున్న నేతలకే టిక్కెట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు.

చేరికలను ప్రోత్సహిస్తూనే....
పార్టీని నమ్ముకున్న వారితో పాటు గెలుపు ప్రధాన అంశంగా ఆయన అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. వచ్చే వారిని కాదనకుండా.. అదే సమయంలో పార్టీలో ఇంతకాలం ఉన్నవారికి ద్రోహం చేయకూడదన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. లేకుంటే పార్టీ క్యాడర్ లోనూ, లీడర్లలోనూ నాయకత్వం పట్ల నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని ఆయనకు తెలియంది కాదు. అదే సమయంలో ఏ ప్రాంతంలో ఎన్ని సీట్లు వస్తాయన్న ముందస్తు అంచనాలతోనే ఆయన అన్ని రకాలుగా కసరత్తులు చేస్తున్నారు. అన్ని రకాలుగా వైసీపీని ఒంటరి చేయడం, ఎలాగైనా అధికారంలోకి రావడానికి చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
సీమలో మాత్రం...
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కేవలం టీడీపీ మూడు స్థానాలకే పరిమితమయింది. ఈసారి రాయలసీమలో జగన్ ను దెబ్బకొట్టి కనీసం ముప్పయి స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, హిందూపురరంతో పాటు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి మాత్రమే టీడీపీ విజయం సాధించింది. కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా అక్కడ గెలిచి జగన్ ను దెబ్బతీయాలన్న ప్లాన్ లో ఉన్నారు. నాలుగు జిల్లాల్లో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఈసారి అధిక స్థానాలను సాధించేందుకు అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
ప్రాంతాల వారీగా...
ఇక ఉత్తరాంధ్ర నుంచి తీసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు టీడీపీకి కంచుకోట. అక్కడ వైసీపీని సులువుగానే దెబ్బతీయవచ్చు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఎటూ జనసేనతో పొత్తు ఉంది కాబట్టి పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన పనిలేదు. ఆ పనిని తన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్ చూసుకుంటారు. ఇక గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పది నుంచి పదిహేను స్థానాలకు పైగా సాధిస్తే అధికారం చేతుల్లోకి వచ్చి పడినట్లే. అందుకోసమే ఆయన గెలుపునకు అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అక్కడ ఎక్కువ నిధులను కుమ్మరించేందుకైనా సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఇటు కులాల వారీగా, ప్రాంతాల వారీగా లెక్కలు వేసుకుని మరీ బరిలోకి దిగుతున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.


Tags:    

Similar News