TDP : బీజేపీతో పొత్తు మరణశాసనమంటున్న టీడీపీ క్యాడర్.. సోషల్ మీడియాలో ఎలుగెత్తుతున్న తెలుగు తమ్ముళ్లు

బీజేపీతో పొత్తు వద్దంటూ టీడీపీ క్యాడర్ పెద్దయెత్తున సోషల్ మీడియాలో చంద్రబాబుకు సూచిస్తున్నారు

Update: 2024-02-10 12:32 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో క్యాడర్ నుంచి వినిపిస్తున్న కామెంట్స్ ఇవే. బీజేపీతో పొత్తు వద్దంటూ ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు. బీజేపీ వల్ల ఉపయోగం ఉండదని, ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం మరణ శాసనమంటూ కామెంట్స్ పెడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అలా వెళ్లి వచ్చారో లేదో కానీ బీజేపీతో పొత్తు వద్దే వద్దంటూ క్యాడర్ నుంచి అనేక మంది చంద్రబాబుకు సూచనలు సోషల్ మీడియా వేదిక ద్వారా పంపుతున్నారు.

జగన్ కు అండగా ఉన్న....
ఇందుకు కారణాలు కూడా అనేకం వాళ్లు చెబుతున్నారు. గత నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వైసీపీకి అండగా ఉందని వారు గుర్తు చేస్తున్నారు. పదేళ్ల నుంచి జగన్ బెయిల్ పై ఉన్నప్పటికీ ఆయన కేసులు ముందుకు వెళ్లకుండా చూడటంలో బీజేపీ ముఖ్యపాత్ర పోషిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. జగన్ ను వెనకేసుకు వస్తున్న వారితో మనకు పొత్తేంటి? అంటూ కొందరు టీడీపీ అధినాయకత్వాన్ని నిలదీస్తున్నారు. చివరకు చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో యాభై రెండు రోజుల పాటు జైలులో ఉండటానికి కూడా కారణం బీజేపీ అంటూ వారు నినదిస్తున్నారు. తమకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమేంటంటూ ట్వీట్ చేస్తున్నారు.
తాము ఓటు వేయమంటూ....
బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ తాము మాత్రం ఆ పార్టీకి ఓటు వేయబోమని, టీడీపీ, జనసేన అభ్యర్థులకు మాత్రమే వేస్తామంటూ మరికొందరు ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. అనేక విషయాల్లో పార్టీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టి, అక్రమ కేసులు బనాయించిన జగన్ సర్కార్ ను ప్రతి అంశంలో వెనకేసుకు వస్తున్న ఆ ఉత్తరాది పార్టీతో మనకేల పొత్తు అంటూ మరికొందరు దూషణభూషణలకు దిగుతున్నారు. తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒప్పుకోమని, ఆ పార్టీతో పొత్తు వల్ల సొంత పార్టీ నుంచే కొందరు దూరమవుతారని కూడా హెచ్చరిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు కూా దూరమవుతారని కూడా చెబుతున్నారు.
కావాలంటే ఎన్నికల అనంతరం...
అయోధ్యలో రామమందిరం నిర్మాణం ప్రభావం ఏపీలో పెద్దగా లేదని, దానినే దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు బీజేపీతో పొత్తుకు దిగడం సరికాదని కూడా కొందరు సూచిస్తున్నారు. మోదీ ఇమేజ్ ఇక్కడ ఏమాత్రం పనిచేయదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడానికి ప్రయత్నం చేసిన పార్టీని ఎవరు దగ్గర చేసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా జనసేనతోనే ఎన్నికలకు వెళ్లాలని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తిరిగి జగన్ కు అధికారం అప్పగించినట్లేనని సోషల్ మీడియాలో సూచనలు పెద్దయెత్తున సాగుతున్నాయి. అవసరమైతే ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకోవాల్సిందిగా మరికొందరు సూచిస్తున్నారు. అంతే తప్ప బీజేపీతో పొత్తు పెట్టుకుని ఘోర తప్పిదం చేయవద్దని, టీడీపీకి ఇప్పుడు మంచి వాతావరణం ఉందని, దానిని చెడగొట్టవద్దని కూడా ఎక్కువ మంది చెబుతున్నారు.


Tags:    

Similar News