Daggubati : దగ్గుబాటి వారి రాజకీయ వైరాగ్యం... అందులో తప్పేముంది?

సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి

Update: 2024-01-12 05:51 GMT

senior leader daggubati venkateswara rao's

దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1990వ దశకంలో రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేత. ఆయన నాడు వస్తున్నాడంటే.. మంత్రుల దగ్గర నుంచి ఐఏఎస్‌ల వరకూ వణికిపోయేవారు. పర్చూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. అయితే ఈరోజు చేసిన వ్యాఖ్యలు నేటి రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. అవును.. కోట్లు లేనిదే.. సీటు రాదు.. సీటు వచ్చినా.. గెలిచేంత వరకూ నమ్మకం లేదు. కోట్లు కుమ్మరించాలి. జనానికి కూడా అదే కావాలి. అభివృద్ధి కాదు.... తమ కేంటి? అని ఆలోచించే రోజులివి. రాజకీయాలు అలా తయారయిపోయాయి. నాటి తరం రాజకీయ నేతలు ఇప్పుడు పోటీ చేయడానికి కూడా వెనకాడుతున్నారంటే అదే కారణం.

నేటి రాజకీయాలు...
దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్న మాటల్లో నూటికి నూరుపాళ్లు నిజముంది. ఓట్లు వేయాలంటే కోట్లు కుమ్మరించాలి. అదే కోట్లను తిరిగి రాబట్టుకునేందుకు కూడా ఇప్పుడు వీలులేకుండా పోయింది. అంతా మాయ అన్నట్లుగా రాజకీయం తయారయింది. ఈ తరహా రాజకీయాల్లో సీటు రాకపోతేనే బెటర్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమని చెప్పాలి. ఎందుకంటే ఒక శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేయాలంటే కనీసం యాభై కోట్లు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉండాలి. ఆ పైన ప్రత్యర్థి ఖర్చు చేసే దాన్ని బట్టి ఎంతైనా కావచ్చు. ఓటు విలువ కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో ఎన్నికల వ్యయం తడిసి మోపెడవుతుంది.
అనుకుంటాం కానీ...
ఎన్నికల కమిషన్ నిబంధనలు అన్నీ కాగితాలలో చూసుకోవడానికే పరిమితయ్యాయని చెప్పక తప్పదు. గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. నామినేషన్ వేసే దగ్గర నుంచి ప్రచారం వరకూ.. వివిధ మాధ్యమాల్లో పబ్లిసిటీ నుంచి.. పోలింగ్ బూత్‌లకు ఓటర్లను చర్చేంత వరకూ ఒకటి కాదు.. రెండు కాదు.. అంతా ఖర్చే. అది తెలిసే నాటి తరం రాజకీయ నేతలు తెలివిగా పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నారు. కొందరైతే తమ వారసులను కూడా ఈ రొంపిలోకి దించడానికి ఇష్టపడటం లేదు. రాజకీయం చేయడం కంటే వ్యాపారమే బెటర్ అన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తుంది. జనం కూడా పాత ఫేస్‌లను అస్సలు పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల్లో ఆయన ఖర్చు ఎక్కువగా చేయకపోవడం వల్లనే పర్చూరులో ఓడిపోయారన్న వాదన ఉంది.
న్యూ లుక్స్ కోసం...
న్యూ లుక్స్ అంటేనే ఇష్టపడుతున్నారు. అందుకే పార్టీ నాయకత్వాలు కూడా కొత్త వారిని ఐదేళ్లకే మార్చేస్తున్నారంటే అది వారి తప్పు కాదు. జనం నాడిని గ్రహించి అధికారంలోకి వచ్చేందుకు కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. వారు కూడా క్యాష్ పార్టీలయితేనే. అంతా డబ్బులుతోనే రాజకీయం నడుస్తుండటంతో ఎవరో అక్కడక్కడ 1990వ దశకంలో కనిపించిన వారు ప్రత్యక్ష రాజకీయాలలో కనిపిస్తారు తప్పించి ఇప్పుడు అంతా వ్యాపారులు, ఎన్ఆర్ఐలు అభ్యర్థులు. అందుకే దగ్గుబాట వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ ను అందరూ స్వాగతిస్తున్నారు. ఆయన అన్నదాంట్లో తప్పేముందని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దగ్గుబాటి కూడా రాజకీయాలు మానుకుని రచనా వ్యాసంగానికి పరిమితం వెనక అసలు కధ ఇదేనన్న మాట.



Tags:    

Similar News