Purandhriswari : చిన్నమ్మ ఆరాటమే కానీ.. మరిది మనసు మార్చుకుంటారా ఏంటి?

పురంద్రీశ్వరి గత పదేళ్లుగా చట్ట సభల్లో అడుగు పెట్టలేదు. 2014 తర్వాత ఆమె గెలుపు బాట పట్టలేదు.

Update: 2023-11-08 12:05 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటినుంచే హీటెక్కాయి. అధికార పార్టీపై అన్ని పార్టీలూ విరుచుకుపడుతున్నాయి. ఇక ఏపీలో గత కొద్ది రోజులుగా బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. పురంద్రీశ్వరి గత కొంత కాలంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలను పెంచడంతో ఆమెను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు కూడా తగ్గేదేలే అంటూ వారు కూడా మండి పడుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అయితే పురంద్రీశ్వరిపై ప్రతి రోజూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా సాగుతుండగా పురంద్రీశ్వరి ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కారణమేమయి ఉంటుందన్న చర్చ జరుగుతుంది.

పదేళ్ల నుంచి...
పురంద్రీశ్వరి గత పదేళ్లుగా చట్ట సభల్లో అడుగు పెట్టలేదు. 2014 తర్వాత ఆమె గెలుపు బాట పట్టలేదు. కాంగ్రెస్ లో ఉన్నా, బీజేపీ లో చేరినా ఆమె విశాఖ నుంచి గెలవలేకపోయారు. అయితే ఈసారి టీడీపీ, జనసేన కూటమి అధికారికంగా ఖరారయింది. బీజేపీ ఇంకా పొత్తుపై ప్రకటించలేదు. కానీ తెలంగాణలో మాత్రం జనసేనతో కలసి ఎన్నికలకు వెళుతుంది. అంటే ఏపీలోనూ పొత్తు కుదిరే అవకాశాలున్నాయని ఎక్కువగా నమ్ముతున్నారు. పార్లమెంటు స్థానాలు దక్కించుకోవాలంటే దక్షిణాదిన ఏపీలో టీడీపీ కూటమితో కలసి పోవడమే బెటర్ అని భావిస్తున్నారు. అదే జరిగితే తన గెలుపునకు ఢోకా లేదని చిన్నమ్మ భావిస్తున్నారు.
విశా‌ఖ నుంచే...
పురంద్రీశ్వరి ఈసారి కూడా విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పొత్తు ఉంటే ఓకే. పొత్తులో భాగంగా విశాఖ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా తాను బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అలాగే బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కూడా విశాఖపై కన్నేశారు. అయితే పవన్, చంద్రబాబుల సాయంతో తనకు సీటు దక్కించుకునేలా చేయవచ్చన్నది చిన్నమ్మ ఆలోచన. పొత్తులో భాగంగా అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంటు స్థానాలకే బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి తన పేరు లిస్ట్ లో ఖరారయ్యేందుకు చంద్రబాబు సహకరిస్తారని కూడా పురంద్రీశ్వరి భావిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది.
కుదరకపోయినా...
ఇక పొత్తు కుదరకపోయినా తాను వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణల దృష్ట్యా చంద్రబాబు నుంచి పరోక్ష సహకారం అందే అవకాశముంది. తాను విశాఖ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగినా బలహీనమైన అభ్యర్థిని టీడీపీ ఎంపిక చేసి తనకు అనుకూలంగా గ్రౌండ్ ను మార్చే అవకాశముందన్న అంచనాలో పురంద్రీశ్వరి ఉన్నారని చెబుతున్నారు. కానీ చంద్రబాబు ఎన్నికల సమయంలో అలా వ్యవహరిస్తారన్నది సందేహమే. అందుకే గతంలో కంటే అన్ని విధాలుగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నది పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. గతంలో ఏపీ బీజేపీలో యాక్టివ్ గా ఉన్న కొందరు నేతలు.. అంటే విష్ణువర్థన్ రెడ్డి లాంటి నేతలు ఇప్పుడు సైలెంట్ కావడానికి కూడా అదే కారణమన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరి చిన్నమ్మ నిజంగానే అందుకోసమే వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారా? లేక పార్టీ బలోపేతం కోసం ఆమె ఫ్యాన్ పార్టీపై ఫైర్ అవుతున్నారా? అన్నది మాత్రం తెలియరావడం లేదు.


Tags:    

Similar News