KCR : కొత్తోళ్లే బెటరేమో.. ఆలోచించు కాకా.. వీళ్లను నమ్ముకునే కంటే.. ఇంక అంతే గతి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వత్తిడి పెరుగుతుంది. కొత్త తరం నాయకత్వాన్ని పార్టీలోకి తేవాలని కోరుతున్నారు

Update: 2024-03-29 12:08 GMT

అవును.. పాత తరం నాయకులను నమ్ముకుంటే ఎప్పటికైనా అంతే. కష్టకాలంలో ఎవరూ తోడుండరు. నిజాయితీగా ఉండే వాళ్లు కొందరే ఉంటారు. నేటి తరం రాజకీయ నేతల్లో అలాంటోళ్లు అరుదుగా కనిపిస్తారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అదే పార్టీని నమ్ముకుని ఉండేవాళ్లు కొందరే. మిగిలినోళ్లంతా మారేటోళ్లే. ఆ విష‍యం గులాబీ బాస్ కు తెలియంది కాదు. ఎందుకంటే.. ఫిరాయింపులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదలుపెట్టింది ఆయనే కాబట్టి. కేవలం డబ్బు, బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదన్నది ఇప్పటికైనా కేసీఆర్ కు తెలిసి వచ్చి ఉండాలి. కేసీఆర్ కు మాత్రమే కాదు అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఈ ఫిరాయింపులు ఒక గుణపాఠమని చెప్పకతప్పదు.

నాడు కాంగ్రెస్ ది...
గత పదేళ్లు కాంగ్రెస్ ఇదే పరిస్థితి ఎదుర్కొంటే... ఈరోజు ఆ గతి బీఆర్ఎస్ కు పట్టింది. తప్పు మారుతున్న నేతలది కాదు. వారిని ప్రోత్సహించి పార్టీలో చేర్చుకుని పదవులు ఇచ్చిన వారిదే. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌ వంటి పార్టీలు భవిష‌్యత్ లోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి. అందుకే రెండు పార్టీలూ కొత్త నాయకత్వాన్ని వెదుక్కోవడం మంచిది. ఎందుకంటే తమకు రాజకీయ బిక్ష ను పెట్టిన పార్టీని యువకులు వదులుకోరు. సీనియర్ నేతలయితేనే ఎక్కువగా పార్టీలు మారుతుంటారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ మారుతున్న వాళ్లంతా సీనియర్ నేతలే. దానం నాగేందర్ కావచ్చు.. కేకే కావచ్చు.. కడియం కావచ్చు.. ఇలా అందరూ అనేక పార్టీలు మారి వచ్చిన వాళ్లే.
కొత్త నాయకత్వాన్ని...
అందుకే రానున్న కాలంలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. కేవలం డబ్బులుంటేనే సరిపోదు. నిబద్ధత,.. కట్టుబాటు.. నిజాయితీ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు అధికారంలో లేని కేసీఆర్ రానున్న ఐదేళ్లలో సీనియర్ నేతలను పూర్తిగా పక్కన పెట్టాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త నాయకత్వాన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తే వారు పార్టీని నమ్ముకుని ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే పార్టీ తరుపున పోరాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతూ గులాబీ జెండాను ఎగురవేయడానికి వారు పనికొస్తారు. నియోజకవర్గాల్లో పార్టీ ఆరంభం నాటి నుంచి అనేక మంది యువకులు పనిచేస్తున్నారు. ఉద్యమంతో కేసీఆర్ తో పాటు పనిచేసిన వారు కూడా ఉన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి...
వారిని రానున్న ఎన్నికలలో పోటీ చేసేలా ప్రోత్సహించాలని కోరుతున్నారు. యువకులకు పార్టీ పగ్గాలను అప్పగిస్తే నాలుగున్నరేళ్లలో పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ వారు దూసుకెళతారన్న అభిప్రాయం గులాబీ పార్టీలో వ్యక్తమవుతుంది. ఇప్పుడు వెళ్లలేని, వెళ్లని సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ ద్వారాలు తెరుచుకోకపోవడంతోనే వెళ్లలేదని, ఆ నియోజకవర్గాల్లోనూ కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పగించాలన్న డిమాండ్ వినపడుతుంది. పాత తరం నేతలను పక్కన పెట్టి.. కొత్త ఫేస్ లను జనాలకు పరిచయమం చేయడం మంచిదన్న సూచనలకు గులాబీ బాస్ కు అందుతున్నాయి. ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెడితే మంచిదని పలువురు నేతలు కూడా సూచిస్తుననారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
Tags:    

Similar News