BJP : ఏపీ బీజేపీలో ఇంత నిశ్శబ్దమా.. కారణాలివేనా?

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు కొంత నిస్తేజంలోనే ఉన్నారు

Update: 2026-03-18 08:04 GMT

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు కొంత నిస్తేజంలోనే ఉన్నారు. అధికారంలో ఉన్నామన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కూటమిలో తీసుకోవాలన్న ఆతృత.. ఆలోచన వారిలో కనిపించడం లేదు. కేవలం కేంద్ర నాయకత్వంపైనే ఆధారపడి ఏపీ బీజేపీ జీవనం సాగిస్తునట్లు కనపడుతుంది. మోదీ చరిష్మాతో పాటు జాతీయ నేతల ప్రచారంతో పాటు కూటమితో పొత్తులో ఉంటే తమకు ఎన్నో కొన్ని స్థానాలు వస్తాయన్న భావనలో ఉంది. అంతే తప్పించి ఇప్పటి వరకూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

ఎందరు నేతలున్నా...
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నుంచి కేంద్ర మంత్రులున్నారు. సీనియర్ నేతలున్నారు. రాష్ట్రమంత్రులున్నారు. కానీ పార్టీని ఎక్కువ నియోజకవర్గాల్లో విస్తరించాలన్న ఆలోచన చేయడం లేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కు కూడా నేతలు పూర్తి స్థాయి సహకారం అందించడం లేదు. రాజమండ్రి ఎంపీ పురంద్రీశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఎవరి దారి వారిదే. అందరూ సమన్వయంగా పనిచేసే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. కూటమి హవాలో మళ్లీ గెలవచ్చన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తుంది.
పలు మార్లు హెచ్చరించినా...
ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వం పలు మార్లు హెచ్చరికలు జారీ చేసింది. అయినా ఏపీ బీజేపీ నేతల్లో మార్పు లేకపోవడాన్ని గమనించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. అందరూ స్తబ్దుగానే ఉంటున్నారు. పార్టీని బలోపేతం చేయడం కోసం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన సాయం ఈ రెండేళ్లలో అందించిన విషయాన్ని కూడా ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఇటీవల సీరియస్ గానే హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటికైనా కమలనాధులు యాక్టివ్ అవుతారో లేదో చూడాలి.


Tags:    

Similar News