Ys Jagan : జగన్ మైండ్ సెట్ మార్చుకోవాల్సిందేనా?
వైసీపీ అధినేత జగన్ చాలా మారాల్సి ఉంది
వైసీపీ అధినేత జగన్ చాలా మారాల్సి ఉంది. మారకుంటే పార్టీకి ఈసారి కూడా కష్టమే. ఎవరు అవునన్నా కాదనుకున్నా కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమ పథకాలను, అటు అభివృద్ధిని అంతే వేగంగా తీసుకెళుతుంది. దీంతో చాలా మంది ప్రజలు మరొకసారి కూటమి ప్రభుత్వానికి అవకాశమిస్తే మంచిదన్న భావనకు కూడా వచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉన్నప్పటికీ, ఈసారి జమిలి ఎన్నికలు జరగుతుండటం కూడా కూటమికి కలసి వచ్చే అవకాశంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓటు బ్యాంకులో మార్పులేదే....
వైఎస్ జగన్ ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో నలభై శాతం వరకూ వచ్చాయి. అయితే అదే సమయంలో జనసేన ఓటు బ్యాంకు పెరిగిందన్న అంచనాలు వినపడుతున్నాయి. గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్ ఓటు శాతం వచ్చిన జనసేనకు ఈసారి డబుల్ డిజిట్ వచ్చే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. అంటే ఒకవేళ టీడీపీ ఓటు బ్యాంకు కొంత తగ్గినా అది జనసేన పార్టీ కవర్ చేస్తుందంటున్నారు. జగన్ లో ఏ మాత్రం మార్పు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. జగన్ అధికారంలో ఉండగా జనం సమస్యలను పట్టించుకోకపోవడం, కేవలం నగదు బదిలీపైనే దృష్టిపెట్టడం వల్ల గత ఎన్నికల్లో భారీగా కూటమి పార్టీలు విజయం సాధించాయి.
రెండేళ్లవుతున్నా...
అయితే ఎన్నికలు జరిగి రెండేళ్లవుతున్నప్పటికీ జగన్ వైఖరిలో మార్పు లేకపోవడంతో పాటు ఇంకా సంక్షేమ పథకాలపైనే తాను గెలుస్తానని చెబుతున్నారు. రెండు ప్రభుత్వాల మధ్య సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని నిన్న జరిగిన ఒంగోలు నియోజకవర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే జగన్ తిరిగి వెల్ఫేర్ పైనే ఆధారపడి ఎన్నికలకు వెళతారని అందరికీ అర్థమవుతుంది. దీనివల్ల మధ్య తరగతి, ప్రభుత్వ ఉద్యోగులు దూరమవుతారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. జగన్ ఇప్పటికైనా తన మైండ్ సెట్ మార్చుకుని, జనం సమస్యలపై ఫోకస్ పెడతానని మాట ఇచ్చి, అభివృద్ధిని కూడా వేగంగా తీసుకెళతానని చెబితే తప్పించి కొంత మెరుగైన ఫలితాలు రావన్నది వాస్తవం.