Mudragada : ముద్రగడను దూరం పెడుతున్నది అందుకేనా... ఆయన వస్తే కష్టమేనట

ముద్రగడ పద్మనాభంను పార్టీల్లోకి చేర్చుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు భయపడుతున్నారు

Update: 2024-01-29 08:11 GMT

కొందరు రాజకీయనాయకులు పార్టీలో ఉండే కంటే బయట ఉంటేనే బెటర్. మరికొందరు బయట ఉంటే కంటే పార్టీలో ఉంటే మంచిది. ఎందుకంటే కొందరు నేతలు బయట ఉంటే చిన్నా చితకా సమస్యలపై చికాకు పుట్టిస్తుంటారు. మరికొందరు పార్టీలో ఉండి అధికారంలోకి వస్తే తలనొప్పిగా తయారవుతారు. ప్రతి నిర్ణయంపై వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో పార్టీ అధినేతలు కూడా ఊహించలేరు. అయితే ఈ రెండింటికి సరిగ్గా సరిపోతారు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ బయట ఉన్నా తలొనొప్పే... పార్టీలో ఉన్నా అంతకంటే ఇబ్బంది. అందుకే ముద్రగడ పార్టీలో చేరికకు ఆలస్యమవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

నిలకడ లేని నేత...
ముద్రగడ పద్మనాభం సీనియర్ నేత. ఆయన పార్టీ ఓటు బ్యాంకు పై ఆధారపడరు. తనకంటూ సొంత ఇమేజ్ ఉంది. ఒక సామాజికవర్గానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతగా ఆయన ఇప్పటి జనరేషన్ కు మాత్రమే తెలుసు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా ఉండి ప్రయివేటు బస్సులపై నిర్ణయంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన అనేక పార్టీలు మారారు. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీలనూ చుట్టివచ్చేశారు. కానీ ఎక్కడా నిలకడతనం లేని నేతగానే ఆయన పేరుపొందారు. ఎందుకంటే ఆయన చెప్పిందే జరగాలి. ఆయన అనుకున్నది పార్టీ అమలు చేయాలి. లేకుంటే వాయిస్ పెంచేస్తారు.
ఎవరూ ముందుకు రానిది...
అందుకే పార్టీలు ముద్రగడ పద్మనాభాన్ని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండవు. ఆయనంటే అదొక భయం. ఒక సామాజికవర్గం బలమైన గొంతుక కావడంతో ఆయనను పక్కన పెట్టుకోవడం పక్కలో బల్లెం పెట్టుకున్నట్లుగానే భావిస్తారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ నాటి ప్రభుత్వంతో యుద్ధమే చేశారు. చివరకు తుని రైలు దగ్దం ఘటనతో కొంత వెనక్కు తగ్గినా ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో కనిపించింది. అంటే ఆయన బయట ఉన్నా ప్రమాదమే. పార్టీలో ఉన్నా ఇబ్బందే. అందుకే ముద్రగడ విషయంలో ఆచితూచి పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారు.
పార్టీలో చేర్చుకోవాలనుకున్నా...
ఇన్నాళ్లూ ప్రస్తుత అధికార వైసీపీ కూడా ముద్రగడను పార్టీలోకి తీసుకోవడానికి అదే కారణమని చెబుతారు. ఇటు టీడీపీ కూడా ఆయన చేరతారన్నా పెద్దగా సంతోషంతో ఎగిరి గంతులు వేయలేదు. అదే బాటలో జనసేన కూడా ఉన్నట్లుంది. ముద్రగడ జనసేనలో చేరతారని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. ఆయన బయట ఉండి తమకు సలహాలు.. సూచనలు ఇవ్వాలని, ఆయనకు ఏదో ఒక గౌరవ ప్రదమైన పదవి ఇస్తే సరిపోతుందన్న భావనలో పార్టీ అధినేతలు ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. తాజాగా బీజేపీ ఆయనకు గవర్నర్ పోస్టు ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అది మాత్రం ముద్రగడకు సరైన ఉద్యోగమంటూ నెట్టింట చాలా మంది పోస్టులు పెడుతున్నారు. కానీ బీజేపీ ఆ సాహసం చేస్తుందా? అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు.


Tags:    

Similar News