Pawan Kalyan : ఆ సౌండ్ వినపడకూడదని జనసేనాని చేస్తున్న ప్రయత్నం ఫలించేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు

Update: 2024-02-11 04:06 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఏపీ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఆయన టీడీపీ, బీజేపీతో కలసి పోటీ చేయడం ఖాయం కావడంతో ఓట్ల బదిలీకి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల వేళ తన అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు, కాపు ఓటర్ల ఓట్లు ప్రతర్థి పార్టీ వైపునకు మరలకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వరసగా తొలుత జిల్లాలను పర్యటించి క్యాడర్ తో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. సీఎం అన్న సౌండ్ వినపడకుండా చేసేందుకు ఆయన తొలి దశలో చర్యలు తీసుకోనున్నారు.

పొత్తులకు కారణాన్ని...
క్యాడర్ తో సమావేశమై ఏ పరిస్థితుల్లో తాము పొత్తులు కుదుర్చుకున్నదీ వివరిస్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావాలని, ఏమాత్రం అలక్ష్యం చేసినా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే యువత భవిష‌్యత్ అంధకారంలో పడినట్లేనని ఆయన వివరించనున్నారు. అందుకోసం ఎవరూ పార్టీ లైన్ ను దాటవద్దంటూ ఆయన సుతిమెత్తంగా ముఖ్య నేతలను కూడా హెచ్చరించనున్నారు. టిక్కెట్ రాలేదని డీలా పడవద్దని, అధికారంలోకి వస్తే పదవులు వస్తాయని హామీ ఇవ్వనున్నారు.
ఓట్లు బదిలీ కాకుండా...
ఈ ఎన్నికల్లో ఓట్లు బదిలీ కావడమే ముఖ్యం. పవన్ కల్యాణ‌్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలన్న డిమాండ్ పెద్దగా వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ పర్యటనలు ప్రాధాన్యతలు సంతరించుకున్నాయి. ఆ సౌండ్ వినపడకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా క్యాడర్ ను మానసికంగా సిద్ధం చేయాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. జిల్లాల్లో తొలుత క్యాడర్ లో సమావేశమై వారికి ఓటు వాల్యూను చెబుతూ ఈ ఎన్నిక తమకు ఎంత ముఖ్యమో కూడా కార్యకర్తలకు, నేతలకు వివరించనున్నారు.
ఈ నెల 14 నుంచి...
అందులో భాగంగా ఈ నెల 14 నుంచి పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని తెలిసింది. పదిహేడో తేదీ వరకూ ఆయన తొలి విడత పర్యటన ఉండనుంది. తొలుత భీమవరంలోనూ, అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండో దశ పర్యటనను కూడా ఫిబ్రవరి నెలలోనే చేపట్టనున్నారు. పార్టీ నేతలను ఎన్నికలకు సమాయత్తం చేయడంతో పాటు క్యాడర్ ను కూడా ఎటువైపు వెళ్లకుండా చేయడమే లక్ష్యంగా ఆయన పర్యటనలు సాగనున్నాయి.
Tags:    

Similar News