Congress, Bjp : రెండు జాతీయ పార్టీల ఛీఫ్ ల ఎంపిక కాకతాళీయమేనా? కావాలనే చేశారా?

ఆంధ్రప్రదేశ్ లో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు మహిళలు అధ్యక్షులుగా ఎంపికయ్యారు

Update: 2024-01-16 12:35 GMT

కాకతాళీయం కావచ్చు. కావాలనే రాజకీయంగా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. తెలియదు కానీ.. ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన జాతీయ పార్టీలకు అధ్యక్షులుగా మహిళలే నియమితులయ్యారు. రెండు పార్టీలూ దేశాన్ని శాసించేవే. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల క్రితం పదేళ్ల పాటు దేశాన్ని పాలిస్తే.. బీజేపీ పదేళ్ల నుంచి దేశాన్ని ఏలుతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో పదేళ్ల పాటు ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత మాత్రం అది మొన్నటి వరకూ రెండు రాష్ట్రాల్లో కోలుకోలేకపోయింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అది విజయం సాధించి అధికారంలోకి రాగలిగింది. అయితే ఏపీలోనూ అదే తరహాలో పవర్ లో రావడానికి దగ్గర దారులను వెతుక్కునే భాగంగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ చీఫ్ గా నియమించింది.

కాంగ్రెస్, బీజేపీలకు...
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను ఆ పార్టీ నియమిస్తే.. అంతకు ముందే పురంద్రీశ్వరిని బీజేపీ పార్టీ చీఫ్ గా కూర్చోబెట్టింది. అయితే ఇద్దరూ వేర్వేరు ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. పురంద్రీశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా అందరికీ సుపరిచితులే. చిన్నమ్మగా ఆమెకు బంధువర్గంలోనే కాదు రాజకీయవర్గాల్లోనూ పేరుంది. తన తండ్రి ఎన్టీఆర్ ఏపీలో తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఆ తర్వాత పురంద్రీశ్వరి కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం పురంద్రీశ్వరి బీజేపీలో చేరారు. తర్వాత ఆమె జాతీయ స్థాయిలో పార్టీ పదవి పొందినా చివరకు ఏపీ చీఫ్ గా నియమితులయ్యారు. మోదీ, షాలకు చంద్రబాబు అంటే పడదు. అక్కడ చంద్రబాబు అనుకూల ఓట్లను చీల్చేందుకు పురంద్రీశ్వరికి బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారన్న వాదన ఉంది. అయితే ఆమె టీడీపీని వదిలేసి అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు.
ప్రాంతీయ పార్టీల నుంచి...
వైఎస్ షర్మిల కూడా దాదాపు అంతే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలకు గుర్తింపు ఉంది. 2019 ఎన్నికల సందర్భంగా ఏపీలో తన అన్న స్థాపించిన వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. తర్వాత ఆమె తెలంగాణకు వెళ్లిపోయారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ ని స్థాపించి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో కేసీఆర్ ను ఓడించాలంటే.. తాను బరి నుంచి తప్పుకోవడమే బెటర్ అని పార్టీని పక్కన పెట్టేశారు. తర్వాత కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీని విలీనం చేశారు. పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక పదవిని అప్పగించింది. ఆమెకు ఇచ్చిన టాస్క్ ను జగన్ ను ఓడించడమే. వైఎస్ జగన్ కు పడే ఓట్లను చీల్చడమే. అయితే అది ఎంత వరకూ సాధ్యమనేది ఇప్పటికిప్పుడు తెలయకున్నా టెన్ జన్ పథ్ మాత్రం ఆమెకు అప్పగించిన టాస్క్ అదే అంటున్నారు. రాబోయే రోజుల్లో షర్మిల ఎవరిపై విమర్శలు చేస్తారో చూడాల్సి ఉంది.
ఓటు బ్యాంకు లేకున్నా....
కాకతాళమీయమని ఎందుకు చెప్పాల్సి వచ్చిందటే.. రెండు పార్టీలకూ ఆంధ్రప్రదేశ్ లో ఓటు బ్యాంకు లేదు. నోటా కంటే ఓటింగ్ తక్కువగా నమోదయ్యాయి. అయితే బీజేపీతో పొత్తుకు టీడీపీ సై అంటుంది. జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది. మరి ఈపొత్తుల సంగతి ఇప్పటి వరకూ తేలలేదు. కాంగ్రెస్ తో మాత్రం ఎవరూ కలవని పరిస్థిితి ఏపీలో ఉంది. అలాగే పురంద్రీశ్వరి ఒంగోలు పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో కడప పార్లమెంటు నుంచి వైఎస్ షర్మిలను పోటీకి దింపడానికి సన్నాహాలు చేస్తుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జాతీయ పార్టీల అధ్యక్షులు చివరకు ఏం సాధిస్తారో తెలియదు కానీ రెండు ముఖ్యమైన రాజకీయ కుటుంబాల నేపథ్యం నుంచి ఇద్దరు పార్టీల చీఫ్ లుగా అవ్వడం మాత్రం విశేషమే.


Tags:    

Similar News