Ys Jagan : ఈసారి ఒంగోలు టిక్కెట్ ఆ ఇద్దరికీ కాదటగా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో ఒంగోలుకు కొత్త అభ్యర్థిని రెడీ చేస్తున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో ఒంగోలుకు కొత్త అభ్యర్థిని రెడీ చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో జగన్ సుముఖంగా లేరంటున్నారు. ఒంగోలు నియోజకవర్గం కార్యకర్తలతోటి భేటీ అయిన జగన్ నియోజకవర్గ ఇన్ ఛార్జి చుండూరు రవికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అయితే అంత మాత్రాన చుండూరు రవికి టిక్కెట్ ఖాయమయినట్లు కాదు. అలాగని బాలినేని శ్రీనివాసరెడ్డికి మళ్లీ పార్టీలో చోటు కల్పించే ఉద్దేశ్యం కూడా లేనట్లే. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే అక్కడ రెడ్డి సామాజికవర్గం నేతలను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికలకు ముందే...
అది ఎవరన్నది ఎన్నికలకు ముందు తేలనుంది. జగన్ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం సమన్వయ కర్తలతోటి, నియోజకవర్గం పరిశీలకులతోటి, యువజన విభాగం తో, విద్యార్థి విభాగం తో, మహిళా విభాగం తో ఇలా ఎన్నో సమావేశాలు జరిపారు. కానీ ఎవరి పేరు అప్పటికప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసిన దాఖలాలు లేవు. అందుకే జగన్ చుండూరి రవికి ప్రాధాన్యత ఉంటుందని మాత్రమే చెప్పారు. అలాగని బాలినేని శ్రీనివాసరెడ్డిని తిరిగి తీసుకుంటే పార్టీ నుంచి వెళ్లిన ఇతర నేతలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ అది నచ్చదు.
బాలినేని ట్వీట్ తో...
మరొకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈరోజు ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ కేవలం నాయకుడు మాత్రమే కాదని, ఆశ్రయం.. అని ఆయన అనడంతో పాటు తను, తన కుమారుడితో పవన్ కల్యాణ్ తో దిగిన ఫొటో షేర్ చేయడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఒంగోలు నియోజకవర్గంలో గతంలో ఐదు సార్లు గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత ఇమేజ్ పై గెలవలేదు. నాడు కాంగ్రెస్ లో వైఎస్, తర్వాత జగన్ ఇమేజ్ తో గెలిచారన్న వాదన కూడా లేకపోలేదు. అందుకే ఒంగోలు నుంచి మరొక ప్రయోగం చేయకుండా రెడ్డి సామాజికవర్గం నేతలకే టిక్కెట్ ఇచ్చే అవకాశముందని పార్టీ నేతలు అంటున్నారు. మరి చివరకు జగన్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాలి.