Yanamala : యనమలకు పెరుగుతున్న ప్రయారిటీ.. త్వరలోనే తీపికబురట

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడి ప్రభావం కనిపించే అవకాశం మాత్రం లేదు

Update: 2026-03-19 09:03 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడి ప్రభావం కనిపించే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే యనమల రామకృష్ణుడు పార్టీకి నిబద్దతతో కొన్ని దశాబ్దాల నుంచి సేవలను అందిస్తున్నారు. యనమల రామకృష్ణుడిపై ఇప్పటి వరకూ ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా రాలేదు. అలాంటిది అల్లుడు డ్రగ్స్ కేసులో చిక్కినందున ఆయన పదవికి వచ్చే ముప్పు ఏమీ ఉండబోదంటున్నారు. ఒకరకంగా యనమలకు ఇది అవకాశమని కూడా అంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ యనమల రామకృష్ణుడు మంత్రి పదవిలో ఉంటారు. చంద్రబాబుకు ఒకటి మైనస్ చేస్తే మరొకటి ప్లస్ చేసే అలవాటు ఉందన్న విషయాన్ని పార్టీ సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఇప్పటి వరకూ ఎలాంటి...
కానీ ఈసారి యనమల రామకృష్ణుడు ఎలాంటి పదవిలో లేకుండా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా శాసనసభలో పార్టీని నడిపించడంలో యనమల సక్సెస్ అయ్యారన్న పేరుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు తిరిగి ఎమ్మెల్సీ పదవి దక్కేది లేదు. ఆయన ఆశించడం కూడా లేదు. ఎందుకంటే ఆయన పెద్దల సభకు వెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలకంటే ఢిల్లీకి వెళ్లాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. తన మనసులో ఉన్న మాటను టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా చెప్పేశారట. కానీ ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వాలంటే అనేక సమీకరణాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో ముగ్గురికి టిక్కెట్లు ఇవ్వడంతో...
గత ఎన్నికల్లో కుమార్తె దివ్యకు తుని ఎమ్మెల్యే టిక్కెట్, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు మైదుకూరు టిక్కెట్, యనమల అల్లుడు మహేశ్ కుమార్ యాదవ్ కు ఏలూరు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఈ ముగ్గురు మొన్నటి ఎన్నికలలో విజయం సాధించారు. అందువల్లనే యనమల రామకృష్ణుడికి ఏ పదవి దక్కలేదు. అయితే ఇప్పుడు పుట్టా మహేశ్ పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ సామాజికవర్గం కోటాలో యనమలకు ఛాన్స్ దక్కే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేశ్ దొరకడం దురదృష్టకరమైనా, ఆయన ఈ కేసు నుంచి బయటపడినప్పటికీ యనమలకు రాజ్యసభ పదవి ఇస్తే యాదవ సామాజికవర్గానికి ప్రయారిటీ ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందుకే యనమల పేరు రాజ్యసభకు ఖరారయినా ఆశ్చర్యం లేదంటున్నారు.









Tags:    

Similar News