Kavitha : కవిత.. టార్గెట్ అదేనట.. భారీ బహిరంగ సభ అక్కడి నుంచే మొదలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త పార్టీ పేరును త్వరలో ప్రకటించనున్నారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త పార్టీ పేరును త్వరలో ప్రకటించనున్నారు. అయితే కవిత చేసిన తాజా వ్యాఖ్యలు ఆమె పోరాటం బీఆర్ఎస్ పైనేనని అర్థమవుతుంది. డాడీ, మోడీ, చిన్న మోడీలపైనే తన పోరాటం సాగుతుందని కవిత తెలిపారు. అంటే కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లపైనే తన పోరాటం ఉంటుందని ఆమె చెప్పకనే చెప్పారు. ఈ మూడు పార్టీలకు వ్యతిరేకంగా తన పార్టీ ఉంటుందని తెలిపారు.
తెలంగాణ ప్రజా జాగృతి పేరిట...
తెలంగాణ ప్రజా జాగృతి పేరిట ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎదుట దరఖాస్తు చేసుకున్నారు. అంటే తాను ఉద్యమ సమయంలో స్థాపించిన తెలంగాణ జాగృతి పేరు కలసి వచ్చేలా ఆమె ఆ పేరును ఎంచుకున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో ఇంకా ఆమోదం పొందలేదు. అయితే అదే పేరుతో జనంలోకి కవిత వచ్చే అవకాశముంది. ఇప్పటికే తనను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తున్నారు. అలాగే ఢిల్లీ మద్యం కేసులో తనను జైలులో పెట్టిన బీజేపీకి వ్యతిరేకంగా ఆమె పనిచేయనున్నారు. మూడు పార్టీలకు తానే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటూ జనంలోకి వెళ్ళనున్నారు.
భారీ బహిరంగ సభతో...
అందుకే కవిత తన పార్టీలోకి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. తన తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయితే వెంటనే జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఆమె పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఈ ఎన్నికల్లో కొత్త తరానికే అవకాశమివ్వాలని, అందులోనూ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారని తెలిసింది. దీంతో పాటు తాను పాదయాత్ర కూడా చేపట్టే అవకాశాలున్నాయి. పార్టీ కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ సభను ఏర్పాటు చేస్తారని తెలిసింది.