కుప్పంలో.. బాబు బై-బై అంటున్నారు : సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి తన సొంత గడ్డ అయిన కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు.

Update: 2023-07-04 12:37 GMT

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి తన సొంత గడ్డ అయిన కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లాలోని పాత చిత్తూరు డెయిరీ అమూల్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తూ ప్రతిపక్షనేత చంద్రబాబుని లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు హయాంలో చిత్తూరు డెయిరీపై కుట్ర జరిగిందన్నారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ డెయిరీ భారీ లాభాల్లో ఉంటే.. చిత్తూరు డెయిరీ నష్టాల్లోకి ఎలా వెళ్లిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇక్కడి రైతులకు ద్రోహం చేయడంతో పాటు ప్రజలు ఉపాధి కోల్పోయారని అన్నారు.

అదే కారణంతో కుప్పం వాసులు నాయుడుకు 'బై-బై' చెప్పేందుకు సిద్ధమయ్యారు. 35 ఏళ్లుగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఇక్కడ సొంత ఇల్లు లేదని, తన రాజకీయ జీవితం దాదాపుగా ముగుస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని మరల్చడానికే కుప్పంలో ఇంటిని నిర్మిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అమూల్‌ కంపెనీ.. ఈ ప్రాజెక్టుపై రూ. 385 కోట్ల పెట్టుబడులు పెట్టి చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తుందని, దీనివల్ల రైతులకు ఉపాధితోపాటు ఎంతో ఊరట లభిస్తుందని సీఎం జగన్ వెల్లడించారు.

పెట్టుబడితో పాటు రూ.182 కోట్ల పెండింగ్ బకాయిలను మా ప్రభుత్వం క్లియర్ చేసిందని, ఇది నా పాదయాత్రలో నేను చేసిన వాగ్దానమని సీఎం జగన్ తెలిపారు. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయాలనే తపనతో సీఎం జగన్ ప్రధానంగా కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడించాలని భావిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో వైసీపీ విస్తృతంగా కసరత్తు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఓడించి ముందుకు సాగింది. సాంకేతికంగా ప్రస్తుతం కుప్పంలో వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది కానీ రాజకీయ సమీకరణాలను బట్టి ఎప్పుడైనా ట్రెండ్ మారవచ్చు.

Tags:    

Similar News