BJP : ఈసారి తెలంగాణలో టార్గెట్ స్థానాలు ఇవేనట.. వాటిపైనే ఫోకస్ పెట్టి మరీ?

తెలంగాణ పార్లమెంటు ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిచే స్థానాలపై ఫోకస్ పెట్టింది

Update: 2024-02-13 05:13 GMT

తెలంగాణ పార్లమెంటు ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలను సాధించిన కమలం పార్టీ అదే సంఖ్యను టార్గెట్ గా పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కమలం పార్టీ గత ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఆ స్థానాలతో పాటు మరో నాలుగు నుంచి ఐదు అంటే ఎనిమిది నుంచి తొమ్మిదిస్థానాలను గెలుచుకుని పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచుకోవాలని వ్యూహరచనలు చేస్తుంది. వరంగల్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, మల్కాజ్‌గిరి, మహబూబాబాద్ స్థానాలపై కన్నేసింది.

సరైన అభ్యర్థులను...
ఈ స్థానాల్లో గట్టి అభ్యర్థులను రంగంలోకి దించి ఎలాగైనా గెలుచుకునే దిశగా కమలం పార్టీ వ్యూహాలను రచిస్తుంది. ఈ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే బీజేపీ సర్వేలు చేయించినట్లు తెలిసింది. ఆదివాసీలు, మాదిగ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో బీజేపీ నేతలున్నారు. అక్కడ తమకు సానుకూల వాతావరణం ఉందని గుర్తించిన పార్టీ అధినాయకత్వం అక్కడ పోటీ కోసం అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించిన బీజేపీ త్వరలోనే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రచారం కూడా...
దక్షిణ భారత దేశంలో తెలంగాణలోనే కొంత అనుకూలమైన వాతావరణం కమలం పార్టీకి ఉంది. కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ఎక్కువ స్థానాలను గెలుచుకునే హోప్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాలని భావిస్తుంది. అగ్రనేతలందరినీ పంపి ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిశ్చయించింది. ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఎక్కువ సంఖ్యలో సభలో పాల్గొనేలా ప్లాన్ చేసింది. బహిరంగ సభలతో పాటు రోడ్‌షోలను కూడా నిర్వహించేందుకు రెడీ అయింది. ప్రచారం కోసం ప్రత్యేకంగా ప్లాన్ ను రూపొందించాలని కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్ర పార్టీకి ఆదేశాలు అందినట్లు తెలిసింది.
ఇతర పార్టీల నుంచి...
కొన్ని నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకకపోతే ఇతర పార్టీల నుంచి లీడర్లను తీసుకోవాలని కూడా ఆ పార్టీ భావిస్తుంది. తెలంగాణలో ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో పనిచేయాలని ఇప్పటికే ముఖ్యనేతలకు పార్టీ కేంద్ర నాయకత్వం సూచించిందని సమాచారం. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కూడా పంపాలని రాష్ట్ర శాఖను కోరినట్లు తెలిసింది. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి రెండు నుంచి మూడు పేర్లను స్క్రూటినీ చేసి పంపాలని సూచించిందని, త్వరలోనే అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థిని ఖరారు చేయాలన్న ఉద్దేశ్యంతో భారతీయ జనతా పార్టీ ఉంది. మరి ఈసారి తెలంగాణలో మోడీ మ్యాజిక్ పనిచేస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News