Anam : ఆనం పార్టీ మారినా ..ఫలితం లేదా? నియోజకవర్గం ఎక్కడ? నెల్లూరులో నిరీక్షణ

సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డికి టిక్కెట్ కేటాయింపు ఎక్కడ అన్నచర్చ టీడీపీలో జరుగుతుంది

Update: 2024-01-25 07:43 GMT

ఆనం రామనారాయణరెడ్డికి మళ్లీ వెంకటగిరి టిక్కెట్ కేటాయించనున్నారా? లేక ఆయనను ఎక్కడికి పంపుతారు? ఆత్మకూరు వెళ్లేందుకు ఆనం అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అలాగే తనకు నెల్లూరు టౌన్ ఇస్తే బాగుంటుందని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. కానీ నెల్లూరు టౌన్ లో ఇప్పటికే టీడీపీ రిజర్వ్ చేసింది. అక్కడ మాజీ మంత్రి నారాయణ పోటీ చేయనున్నారు. జనసేన, టీడీపీతో పొత్తుతో ఈసారి నేరుగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెడతానని నారాయణ చెబుతున్నారు. నెల్లూరు సిటీ సీటును ఆనం రామనారాయణరెడ్డికి ఇచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. అయితే ఆత్మకూరు నియోజకవర్గానికి వెళ్లాలని పార్టీ చెబుతున్నా అందుకు ఆనం అంగీకరించడం లేదని తెలిసింది.

ఆత్మకూరుకు వెళ్లాలని ఉన్నా...
ఆత్మకూరు నియోజకవర్గంలో పట్టున్న మేకపాటి కుటుంబం ఉంది. ఆర్థికంగా బలమైన కుటుంబం కావడంతో పాటు మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి ప్రభావం కూడా ఎంతో కొంత ఉండే అవకాశముంది. పైగా రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. వారితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఎక్కువే. అందుకే ఆత్మకూరు తనకు సరైన ప్లేస్ కాదన్నది ఆనం అంచనా వేసుకుంటున్నారు. 1994 తర్వాత టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గంలో గెలవలేకపోయింది. అనేక మంది అభ్యర్థులను మార్చినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీకి పెద్దగా పట్టులేని నియోజకవర్గంగా పేరుండటంతో ఆనం అక్కడ పోటీ చేయడానికి ఇష్టపడటంలేదు.
చరిత్ర ను చూస్తే...
ఆనం రామనారాయణరెడ్డి కూడా 2009లో ఒక్కసారి మాత్రమే ఇక్కడ గెలిచారు. అదీ కాంగ్రెస్ పార్టీ నుంచి. స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన చరిత్ర ఆత్మకూరులో ఉంది కానీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందడం కష్టమని ఆయన అంచనా వేసుకుంటున్నారు. అయితే ఆయనకు టీడీపీ ఎక్కడ సీటు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆనం రామనారాయణరెడ్డికి తిరిగి వెంకటగిరి నియోజకవర్గం కేటాయిస్తారా? అన్న సందేహమే అయితే ఉంది. అదే ఆయన కూడా అంచనా వేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన రా కదలిరాసభలో చంద్రబాబు ఆనం అభ్యర్థి అని నేరుగా ప్రకటించకపోయినా తనకే ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అదే జరిగితే ఆయన పార్టీ మారి ప్రయోజనం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.
బలమైన నేత ఉండటంతో...
మరోవైపు అక్కడ బలమైన టీడీపీ నేత ఉన్నారు. కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ నేతగా ఉన్నారు. ఆయనను కాదని ఆనంకు టిక్కెట్ ఇస్తే రామకృష్ణ సహకరిస్తారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. కురుగొండ్ల రామకృష్ణ రెండు సార్లు వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014లో ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అలాంటి నేత తనకు టిక్కెట్ ఇవ్వకుంటే అంగీకరించే ప్రసక్తి ఉండదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఆనం రామనారాయణరెడ్డికి నెల్లూరు జిల్లాలో సీటు ఎక్కడ? అన్న చర్చ జరుగుతుంది. పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆనం పార్టీ మారినా.. ఫలితం ఉండదా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.




Tags:    

Similar News