Ap Politics : ముగ్గురిలో నమ్మకం పర్సంటేజీ ఎంత..? ఇంత అని చెప్పలేనంత

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ, బీజేపీ కూటమి ఏర్పడింది. వచ్చే ఎన్నికలకు మూడు పార్టీలు కలసి వెళుతున్నాయి.

Update: 2024-03-19 07:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడింది. వచ్చే ఎన్నికలకు మూడు పార్టీలు కలసి వెళుతున్నాయి. కాని ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి కింది స్థాయి క్యాడర్ వరకూ అనుమానాలు. నిజంగా పొత్తు ఉందా? అన్న సందేహాలు ఆ పార్టీల క్యాడర్ లో కనిపిస్తుండటం ఇప్పుడు నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓట్లు బదిలీ అవుతాయా? అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. చిలకలూరిపేటలో జరిగిన సభతో తొలిగిపోవాల్సిన అనుమానాలు మరింత పెరిగినట్లే కనిపిస్తుంది. అసలు బీజేపీ తమతో మనస్ఫూర్తిగా పొత్తు పెట్టుకుందా? అన్నది తెలుగుదేశం పార్టీ నేతలను వేధిస్తున్న ప్రశ్న.

డీలా పడ్డ నేతలు...
ఎందుకంటే మోదీ వ్యవహారశైలి చూస్తుంటే జగన్ ను రాజకీయంగా దూరం చేసుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదంటున్నారు. అందుకే ఆయన జగన్ పై విమర్శలు చేయకుండా దాటవేసి వెళ్లిపోయారంటున్నారు. చంద్రబాబును ప్రశంసించడం కాదు వాళ్లకు కావాల్సింది.. జగన్ ను దూషించడం.. విమర్శించడం.. కానీ అది మాత్రం జరగలేదు. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ఆయన సభలో పాల్గొని వెళ్లిపోయారు. సభలో మోదీ ప్రసంగం ప్రారంభమయ్యే వరకూ ఉత్సాహంగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు అది ముగిసిన తర్వాత మాత్రం డీలా పడ్డారని చెప్పాలి. కానీ ప్రధానికి చెప్పేదెవరు? ఆయనను డైరెక్ట్ చేయగలిగిన సత్తా, శక్తి ఇక్కడ ఎవరికి ఉంది?
ఆలింగనంతో అనుమానాలు...
ఇప్పుడు అదే అనుమానం మరింత బలపడింది. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంది ఓట్లు వచ్చి పడతాయి అని కాదు... ఎలక్షనీరింగ్ కోసమే. ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ఇబ్బందులను పెట్టకుండా నిరోధించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సాయపడుతుందనే ఆయన పొత్తుకు సిద్ధమయ్యారు. ఎంతో కాలం వేచి ఉండి మరీ ఆలింగనం చేసుకున్నారు. కానీ ఆ ఆలింగనం పైపైకే అని ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలకు అర్థమవుతుందట. దక్షిణాదిని నాలుగు సీట్లు గెలుచుకోవాలన్న ఉద్దేశ్యంతోనే తమతో పొత్తు పెట్టుకున్నారన్న విష‍యం అర్థమయ్యే లోగా అంతా జరిగిపోయిందని ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వాపోతుండటం విశేషం.
నాటి పరిస్థితులకు...
2014 ఎన్నికల పరిస్థితులకు.. నేటికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు మోదీ అధికారంలోకి రాలేదు. అప్పటి వరకూ చంద్రబాబు రాజకీయాల్లో సీనియర్. పవన్ నేరుగా పోటీ కూడా చేయలేదు. కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు. మోదీ స్ట్రాంగ్ అయ్యారు. ఆయనకు ఎవరు ఏంటో తెలుసు. మోదీ చంద్రబాబును నమ్మరు. అలాగే చంద్రబాబు మోదీని విశ్వసించరు. ఇద్దరికీ పవన్ కల్యాణ్ పై పెద్దగా ఆశలు లేవు. పవన్ ఒక్కరే వారిద్దరినీ గుడ్డిగా నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలోని మూడు పార్టీల ఓట్లు ఏ మేరకు బదిలీ అవుతాయన్న చర్చ టీడీపీలో బాగానే జరుగుతుంది. ఒకసారి పొత్తులో భాగంగా నియోజకవర్గంలో పట్టు కోల్పోతే ఇక భవిష్యత్ లో తమకు రాదన్న భయం టీడీపీ నేతల్లో కూడా ఉంది. అందుకే నేతలను ఎంతగా బుజ్జగించినా.. సముదాయించినా.. మనసులో మాత్రం అనుమానాలు.. రాజకీయ భవిష‌్యత్ పై సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News