సామాన్యుడిపై ‘ధరా’ఘాతం!

కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది.

Update: 2023-06-27 00:30 GMT

vegitable prices hiked

అమాంతం పెరిగిపోయిన కూరగాయల ధరలు

రూ.100కి చేరువలో కిలో టమాటా

కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఏ కూరైనా కనీసం కిలో అరవై రూపాయలు పలుకుతోంది. చవకగా దొరికే దొండకాయలు కూడా అరవై రూపాయలకు చేరడం గమనార్హం. ఇక టమాటా అయితే ఎనభై రూపాయలకు చేరిపోయింది. ఒకట్రెండు రోజుల్లోనే అది వంద రూపాయల బెంచ్‌ మార్క్‌ను అందుకుంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

కేవలం బంగాళదుంప, ఉల్లిపాయలు మాత్రమే ఇరవై నుంచి ముప్పయ్‌ రూపాయలకు దొరుకుతున్నాయి. బెండకాయ, క్యాబేజీ, కాకరకాయ, చిక్కుడు కాయ ఇలా ఏ కూర కొందామన్నా జేబులకు చిల్లులు పడుతుంటంతో పావు కిలో చొప్పున కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. బీన్స్‌ 120 రూపాయలు, క్యారెట్‌ ఎనభై నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక అరటికాయను 15 నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారంటే ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలే అరకొర జీతాలతో బతికే మధ్యతరగతి వారికి ధరాఘాతం తప్పడం లేదు. ముఖ్యంగా టమాటా లేనిదే కూరలు వండుకోలేని వారికి, వాటి ధరలు మింగుడు పడటం లేదు.

రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం, వర్షాలు లేకపోవడమే కూరగాయల ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కోలార్‌ ప్రాంతంలో టమాటా పంట తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వెల్లడిస్తున్నారు. సాధారణంగా ఆషాఢ మాసంలో కూరగాయల ధరలు అందుబాటులోనే ఉంటాయి. కానీ వర్షాభావం వల్ల ఇతరత్రా కూరగాయల పంటలు కూడా తగ్గిపోయాయని, ఆ ప్రభావం వల్ల డిమాండ్‌ పెరిగి, సప్లయ్‌ తగ్గి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌ వర్గాల భోగట్టా.

ఈ ధరల పెరుగుదల ఇలానే ఉంటే హోటళ్లలో టిఫిన్లు, భోజనాల రేట్లు కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఇది కూడా మధ్య తరగతి వెన్ను విరిచేదే. కూరగాయలకు తోడు పెరుగుతున్న కరెంట్‌ ఛార్జీలు, పాలు, నీళ్ల ధరలు మధ్య తరగతి బడ్జెట్‌ను మరింత పెంచేస్తున్నాయి. ఎక్కడ, ఏ వస్తువు ధర పెరిగినా బలైపోయేది బీద, మధ్యతరగతి వర్గాలే.

Tags:    

Similar News