Vice President : ఒక్క పదవి.. పది పేర్లు.. చివరకు ఎవరి పేరు ఖరారవుతుందో?
జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవిపై క్లారిటీ వచ్చినట్లుంది.
జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవిపై క్లారిటీ వచ్చినట్లుంది. బీజేపీకే ఈ పదవి దక్కే అవకాశముంది. ఉపరాష్ట్రపతి పదవి కోసం అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చినా అవి ప్రచారానికే పరిమితమవుతాయని అంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్ నేత శశిధరూర్ తో పాటు చివరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు కూడా వినిపించింది. దీంతో పాటు ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ పేరు కూడా పరిశీలనలో ఉందని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. హరివంశ్ నారాయణ్ సింగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడంతో ఈ ప్రచారానికి మరింత ఊపు అందుకుంది.
అనేక రకాలుగా...
మరొకవైపు ప్రస్తుత లోక్ సభ స్పీకర్ ను ఓంబిర్లాను ఉప రాష్ట్రపతిగా నియమించి ఆయన స్థానంలో ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ పురంద్రీశ్వరిని లోక్ సభ స్పీకర్ గా నియమిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అదంతా ఉత్తుత్తిదేనని అంటున్నారు. అటువంటి ప్రయోగాలు బీహార్ ఎన్నికల సమయంలో బీజేపీ నాయకత్వం చేయబోదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలను దక్కే విధంగానే ఉప రాష్ట్రపతి ఎంపిక ఉంటుందని చెబుతున్నారు. అందులో అనేక పేర్లు వినిపించినా.. చివరకు అవన్నీ ఒట్టిదేనని తేలింది. పార్లమెంటు సభ్యులు ఎన్నుకోవాల్సిన పదవి కావడంతో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.
మరో నేత పేరు...
దీంతో ఉప రాష్ట్రపతి పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ వర్గాలు పరిణామాలను ఉత్కంఠతో గమనిస్తున్నాయి. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీహార్ నేతలకే ఉప రాష్ట్రపతి పదవి ఇస్తారన్నది మాత్రం ఖాయమని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అయితే మరొక ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. ఉప రాష్ట్రపతి పదవిని బీహార్ కు చెందిన రామ్ నాధ్ ఠాకూర్ ను ఎంపిక చేయవచ్చన్న ప్రచారం కూడా మొదలయంది. రామ్ నాథ్ ఠాకూర్ కేంద్ర మంత్రి గా ఉన్నారు. ఆయన జేపీ నడ్డాను కలవడంతో ఈ ప్రచారానికి ఊపందుకుంది. అయితే ఇది కూడా ప్రచారమేనని కొందరు కొట్టిపారేస్తున్నారు.