అరవై రూపాయలకు అడిగినంత భోజనం.. కానీ వేస్ట్ చేస్తే మాత్రం..

మధ్యప్రదేశ్, ఇండోర్ నగరంలోని కర్నావత్ రెస్టారెండ్ ఈ వినూత్న ఆఫర్ ను ప్రకటించింది. ఆ జరిమానా నిబంధన అందరికీ కనిపించేలా..

Update: 2023-03-14 07:24 GMT

unlimited food in indore

అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. ఈరోజు మన కడుపు నింపుకోవడానికి ఐదువేళ్లతో గుప్పెడు మెతుకులు తింటున్నామంటే.. వాటిని పండించడానికి రైతు ఎండనక, వాననక ఆరుగాలం ఎంతో కష్టపడతాడు. కానీ కొందరు మాత్రం.. తిండి ఎక్కువై, కావాలసిన దానికన్నా ఎక్కువ తీసుకుని తినలేక పారేస్తుంటారు. కనీసం తినడానికి లేనివారికి ఆ ఆహారం పెట్టాలన్న ఆలోచన కూడా రాదు. అలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు ఓ రెస్టారెంట్ కస్టమర్లకు వింత ఆఫర్ ఇచ్చింది. కేవలం రూ. 60కే అడిగినంత భోజనం పెడతామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక్కడే ఒక కండీషన్ కూడా ఉంది. ఎంత తిన్నా ఫర్వాలేదు కానీ ఒక్క మెతుకు వదిలేసినా జరిమానా తప్పదు. ఇంతకీ ఆ జరిమానా ఎంతో తెలుసా రూ.50.

మధ్యప్రదేశ్, ఇండోర్ నగరంలోని కర్నావత్ రెస్టారెండ్ ఈ వినూత్న ఆఫర్ ను ప్రకటించింది. ఆ జరిమానా నిబంధన అందరికీ కనిపించేలా రెస్టారెంట్ గోడపై పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉన్న పేపర్ ను అతికించింది. రూ. 60కే కావాల్సినంత తినొచ్చన్న ఆఫర్‌కు జనం ఎగబడతారని రెస్టారెంట్ యాజమాన్యం అంచనా వేసింది. కొందరు తాము తినగలిగినదానికంటే ఎక్కువ ఆర్డర్ చేసి చివరకు ఆహారాన్ని పారేసి వెళ్లిపోతారని భయపడింది. అందుకే ఈ జరిమానా ఆలోచనను అమలు చేసింది. తమకు ఎక్కువైన ఆహారాన్ని పారేసే అలవాటును మాన్పించాలన్న ఉద్దేశంతోనే ఇలా జరిమానాలు విధించేందుకు నిర్ణయించామని రెస్టారెంట్ యజమాని అర్వింద్ సింగ్ కర్నావత్ తెలిపారు. రైతు కష్టం వృథా కాకూడదన్నారు. ఇక రోజుకు రెండు పూటలా తిండి తినలేని పేదలు ఎందరో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.






Tags:    

Similar News