Supreme Court : వీధికుక్కల దాడులపై సుప్రీంకోర్టు ఆందోళన

వీధి కుక్కుల దాడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Update: 2025-11-07 06:42 GMT

వీధి కుక్కుల దాడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యాసంస్థలు, ఆస్పత్రుల వంటి సంస్థల పరిసరాల్లో కుక్కల దాడులు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి కుక్కలను గుర్తించి ఆశ్రయాలకు తరలించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియా లతో కూడిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై పశువులు, ఇతర వీధి జంతువులు సంచరించకుండా జాతీయ రహదారి అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.

వీధికుక్కలు రాకుండా...
విద్యాసంస్థలు, ఆస్పత్రుల ప్రాంగణాల్లో వీధి కుక్కలు ప్రవేశించకుండా చూడాలని న్యాయస్థానం తెలిపింది. అక్కడి నుంచి పట్టుబడిన కుక్కలను తిరిగి అదే ప్రదేశంలో వదిలిపెట్టరాదని స్పష్టం చేసింది. జాతీయ రహదారులపై జంతువులు తరచూ కనిపించే ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖలు సంయుక్త డ్రైవ్‌ చేపట్టాలని సూచించింది. తదుపరి విచారణను జనవరి 13కి వాయిదా వేసింది. గత నవంబర్ 3న కోర్టు, సంస్థల పరిసరాల్లో ఉద్యోగులు వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ప్రమాదం పెరుగుతోందని వ్యాఖ్యానించింది.


Tags:    

Similar News