ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

అప్పటి అల్లర్ల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జాఫ్రీ సహా 68 మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2022-06-24 07:16 GMT

గుజరాత్ అల్లర్లలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. క్లీన్ చిట్ ను వ్యతిరేకిస్తూ నాటి అల్లర్లలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది.

అప్పటి అల్లర్ల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జాఫ్రీ సహా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. గోద్రాలో సాధువులతో వెళుతున్న రైలు కోచ్ కు దుండగులు నిప్పు పెట్టడం.. 59 మంది సాధువులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. నాటి మత ఘర్షణలపై తాజా దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని జకియా జాఫ్రీ సుప్రీంకోర్టును కోరారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ, రాజకీయ నాయకులు, పోలీసుల పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాజా దర్యాప్తునకు ఎటువంటి ఆధారాల్లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సిట్ 2012 ఫిబ్రవరిలో దర్యాప్తు ముగింపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడమే కాకుండా, మోదీతోపాటు మరో 63 మందికి సంబంధించి ఎటువంటి ఆధారాల్లేవని తెలిపింది.
ఫిబ్రవరి 28, 2002న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో జరిగిన హింసాకాండలో 69 మంది మరణించారు. ఇక గోద్రా అల్లర్ల ఘటన తర్వాత.. చెలరేగిన హింసాత్మక ఘటనల్లో వెయ్యి మందికిపైగా చనిపోయారు. ఇందులో మోదీ ప్రమేయం ఉందడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అల్లరి మూకలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణమని అప్పటి నానావతి కమిషన్ కూడా తెలిపింది. గుజరాత్‎లోని గోద్రా సహా పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీతో పాటు పలువురి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2008లో అల్ల‌ర్ల‌పై సిట్ ద‌ర్యాప్తు ప్రారంభ‌మైంది. 2010లో అప్పటి గుజరాత్ సిఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని సిట్ దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోడిని 2012 ఫిబ్రవరి 8న సిట్ తప్పించింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తూ సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది.


Tags:    

Similar News