Women's Day : తొలి వైమానిక దళ మహిళా కమాండర్ గా షాలిజా ధామి

తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 90 ఏళ్ల వైమానిక దళ చరిత్రలో తొలి మహిళా కమాండర్ గా షాలిజా ధామి..

Update: 2023-03-08 06:14 GMT

 IAF first woman commander

మహిళ అంటే.. ఒకప్పుడు వంటింటికే పరిమితం. కానీ ఇప్పుడు అన్నిరంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. చదువు, ఉద్యోగం, వృత్తి, వ్యవసాయం, నింగీ, నేల, నీరు.. అటు విదేశాల్లో ఇలా ప్రతి చోటా.. విజయం తమదేనని ఎలుగెత్తి చాటుతున్నారు. ఆడది తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని నిరుపిస్తూ.. ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నారు. అమ్మ, అక్క, చెల్లి, భార్య ఇలా.. ప్రతి బంధంలోనూ బాధ్యతలను నెరవేర్చడంతో పాటు.. బయట కూడా అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. మల్టీటాలెంట్ తమ సొంతం అని చెప్పకనే చెబుతున్నారు. ఆఖరికి యుద్ధభూమిలోనూ తామెంటో నిరూపిస్తున్నారు. భర్తలను దేశం కోసం అర్పించినా..దేశం కోసం మేము కూడా సేవలందిస్తామంటూ ఆర్మీలో చేరి దేశ సేవకు అంకితమవుతున్నారు.

తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 90 ఏళ్ల వైమానిక దళ చరిత్రలో తొలి మహిళా కమాండర్ గా షాలిజా ధామి నియమితురాలైంది. భారత వైమానిక దళం పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని క్షిపణి స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి ని నియమించింది. మహిళా దినోత్సవం ముందురోజున అంటే.. మార్చి 7న షాలిజాకు ఈ బాధ్యతలను అప్పగించింది. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఉన్న అత్యంత క్వాలిఫైడ్ హెలికాప్టర్ పైలట్ అయిన ధామి..భారతదేశం అత్యంత సున్నితమైన సరిహద్దు సెక్టార్‌లలో కమాండ్ కంట్రోల్‌ను పర్యవేక్షించనున్నారు. భారతీయ వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) 1932, అక్టోబరు 8వ తేదీన స్థాపించబడి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వైమానిక దళంగా పేరుపొందింది. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన భారత వైమానిక దళంలో ధామి తొలి మహిళా కమాండర్ గా బాధ్యతలు చేపట్టి.. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.






Tags:    

Similar News