Parlament : ముప్ఫయి రోజులు జైలులో ఉంటే పదవి ఊడుతుంది... ఎవరైనా సరే?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నేడు పార్లమెంటులో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. ఎవరైనా తీవ్రమైన నేరారోరపణలతో నెల రోజుల పాటు జైలులో ఉంటే పదవి నుంచి తొలగించేలా బిల్లును తీసుకు వస్తుంది

Update: 2025-08-20 03:27 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నేడు పార్లమెంటులో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. ఎవరైనా తీవ్రమైన నేరారోరపణలతో నెల రోజుల పాటు జైలులో ఉంటే పదవి నుంచి తొలగించేలా బిల్లును తీసుకు వస్తుంది. అది ప్రధానమంత్రి అయినా... కేంద్ర మంత్రి అయినా.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా , రాష్ట్ర మంత్రి అయినా ఎవరైనా సరే తీవ్రమైన నేరారోపణలతో ముప్ఫయి రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ఖచ్చితంగా పదవి పోయేలా ఈ బిల్లును రూపొందించింది. 31వ రోజున వారి పదవి ఆటోమేటిక్ గా పోతుంది. వారంతట వారు రాజీనామా చేయకపోయినా పదవి మాత్రం ఊడిపోతుంది. దీంతో ముప్ఫయి రోజులు దాటితే ఎవరైనా సరే పదవికి రాజీనామా చేయాల్సిందే.

నచ్చని నేతలను...
అయితే ఈ బిల్లుపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ బిల్లును కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వస్తుందని ఆరోపిస్తుంది. తమకు నచ్చని నేతలను, తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను గద్దె దించడానికి ఈ బిల్లును బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకోవడానికే తప్ప మరో ప్రయోజనం లేదని కాంగ్రెస్ తో పాటు ఇండి కూటమి పార్టీలు వాదిస్తున్నాయి. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీలు వివిధ కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ తమ పదవులకు రాజీనామా చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి ఈ బిల్లును తెస్తుందంటున్నారు.
విపక్ష ప్రభుత్వాలను అస్థిరపర్చడానికే...
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను అస్థిర పర్చటానికి ఈ బిల్లును ఉపయోగించుకునేందుకే బీజేపీ ప్రభుత్వమే అప్రజాస్వామికంగా బిల్లును సభ ముందుకు తెస్తుందని కాంగ్రెస్ నేతలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమ కేసులతో జైలుకు పంపి, నేరారోపణ రుజువు కాకపోయినా పదవి కోల్పోయేలా చేసేందుకు ఈ కొత్త పద్ధతిని బీజేపీ ప్రభుత్వం ఎంచుకుందని అంటుున్నారు. ఇలాంటి బిల్లుల వల్ల దేశంలో నియంతృత్వం మరింత పెరిగిపోతుందన్న కామెంట్స్ ను విపక్షాలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లును విపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించనున్నాయి. అయినా నేడు పార్లమెంటులో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది.


Tags:    

Similar News