వణికిస్తోన్న వర్షాలు.. 40 ఏళ్ల రికార్డు బ్రేక్

ఢిల్లీలో నిన్న ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం..40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. గడిచిన 4 గంటల్లో దేశరాజధానిలో..

Update: 2023-07-09 06:48 GMT

red alert north districts

ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. నదులు ఉప్పొంగుతున్నాయి. నది ఒడ్డున ఉన్న ఓ కారుని వరద లాక్కెళ్లిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు 24 గంటల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో మూడోరోజూ అమర్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. పంచతర్ణి వద్ద చిక్కుకున్న 1500 మంది యాత్రికులంతా బేస్ క్యాంపుల్లోనే ఉన్నారు. కొండచరియలు విరిగి పడుతుండటంతో జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేశారు. మెరుపు వరదలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. వదరల్లో చిక్కుకున్న ఆరుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.

ఢిల్లీలో నిన్న ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం..40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. గడిచిన 4 గంటల్లో దేశరాజధానిలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాకాలంలో కురవాల్సిన మొత్తం వర్షపాతంలో ఇది 15 శాతానికి సమానమని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. 1982 జులైలో ఈ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని చెబుతున్నారు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఇంటి పైకప్పు కూలి 58 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవల విభాగాల్లో ఉద్యోగులకు వారాంతపు సెలవులను రద్దు చేసింది ప్రభుత్వం. రాజస్థాన్ లో గడిచిన 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. మొత్తం 9 జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో వైపు జమ్మూలోనూ 2 జిల్లాల్లో వరదల ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కతువా, సాంబ జిల్లాల్లో మూడోరోజూ వర్షాలు పడుతుండటంతో నదీపరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. షిమ్లాలో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మృతి చెందారు.


Tags:    

Similar News