పాక్ అమ్మాయితో పంజాబ్ అబ్బాయికి పెళ్లి..!

భారతదేశంలో ఎలా అనిపిస్తుందోనని ఆమెను అడగగా.. షుమైలా మాట్లాడుతూ

Update: 2022-07-07 14:23 GMT

జలంధర్: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో నివాసముంటున్న షుమైలా, భారతదేశంలోని పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన తన దూరపు బంధువు కమల్ కళ్యాణ్‌ను వివాహం చేసుకోనున్నారు. సరిహద్దు అవరోధాలు, ఇతర సమస్యలన్నింటినీ అధిగమించి బుధవారం ఆమె తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి భారతదేశానికి చేరుకున్నారు. షుమైలా తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు. అక్కడ ఆమెకు వరుడు కమల్ కళ్యాణ్, అతని కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. షుమైలా- కమల్‌లు 2018లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2020లో వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా వివాహం జరగలేదు.

భారతదేశంలో ఎలా అనిపిస్తుందోనని ఆమెను అడగగా.. షుమైలా మాట్లాడుతూ "నేను చాలా బాగున్నాను. ఇక్కడ నా స్వంత వ్యక్తులతో ఉన్నట్లు అనిపిస్తోంది. నాకు ఎవరూ కొత్త కాదు, అందరూ నావారే. నేను కోడలిగా కాకుండా కూతురిగా స్వాగతించబడ్డాను" అని ఆమె చెప్పుకొచ్చారు. "నాకు వీసా రావడానికి ముందు మేము రెండు సార్లు దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది," అని షుమైలా కఠినమైన నిబంధనల గురించి చెప్పింది. చాలా మంది ప్రజలు పాకిస్థాన్ నుంచి భారత్‌కు వెళ్లాలనుకుంటున్నారని, అయితే వీసా ఫార్మాలిటీల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని షుమైలా చెప్పుకొచ్చింది.వీసాలు పొందడంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇరు దేశాల ప్రభుత్వాలు ప్రక్రియను సులభతరం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.


Tags:    

Similar News