వాణిజ్య విమానంలో కిడ్నీ తరలింపు: కేరళలో తొలిసారి
కన్నూరు నుంచి తిరువనంతపురానికి విమానంలో అవయవం తరలించారు
కన్నూరు నుంచి తిరువనంతపురానికి విమానంలో అవయవం తరలించారు. కేరళలో తొలిసారి కమర్షియల్ ఫ్లైట్ లో అవయవాన్నితరలించారు. అవయవ మార్పిడి ప్రక్రియలో భాగంగా కన్నూరు నుంచి తిరువనంతపురానికి కిడ్నీని విమానంలో తరలించినట్లు కే–సోటో అధికారులు తెలిపారు. గురువారం ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ తరలింపు పూర్తయ్యింది.
హెలికాప్టర్ వినియోగంలో...
కన్నూరు జిల్లా పయ్యావూరులోని పాఠశాల భవనం నుంచి పడిపోవడంతో మృతి చెందిన అయోనా మాన్సన్ కిడ్నీని తిరువనంతపురం మెడికల్ కాలేజీకి పంపించారు. ఈ కిడ్నీని పరసాల ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల మహిళకు మార్పిడి చేయనున్నారు. రాష్ట్రంలో అవయవ మార్పిడులను పర్యవేక్షించే కేరళ స్టేట్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ ఈ తరలింపును సమన్వయం చేసింది. కే–సోటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నోబుల్ గ్రేషస్ ఎస్‌ఎస్ మాట్లాడుతూ, బుధవారం రాత్రి ఆలస్యంగా తిరువనంతపురంలోని రోగికి ఒక కిడ్నీ కేటాయించామని చెప్పారు. నిర్ణీత సమయంలో కిడ్నీని అక్కడికి చేర్చడం ప్రధాన సవాలుగా మారిందన్నారు. హెలికాప్టర్ వినియోగంలో సాంకేతిక సమస్యలు ఎదురవడంతో వాణిజ్య విమానాన్ని ఉపయోగించాల్సి వచ్చిందని వివరించారు.