Gas Cylinder : గ్యాస్ కే ఇంత కొరత ఎందుకు? కేంద్రం తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలిస్తాయా?

మధ్య ప్రాచ్యంలో యుద్ధ ప్రభావం కారణంగా కేంద్ర పెట్రోలియం శాఖ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది

Update: 2026-03-11 04:43 GMT

మధ్య ప్రాచ్యంలో యుద్ధ ప్రభావం కారణంగా కేంద్ర పెట్రోలియం శాఖ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఎల్‌పీజీ సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంచింది. ఎల్‌పీజీ సరఫరాపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. రిఫైనరీలకు ఎల్‌పీజీ ఉత్పత్తి పెంచాలని సూచించింది. గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్‌ మార్కెటింగ్‌ నివారణకు ఇరవై రోజుల బుకింగ్‌ గ్యాప్‌ ఉంచాలని నిర్ణయించింది.దిగుమతి ఎల్‌పీజీ నాన్‌-డొమెస్టిక్‌ రంగాలకు కేటాయించాలని సూచించింది. ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు ప్రధమ ప్రాధాన్యం ఇవ్వాలని స్సష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. ఆ ప్రకారమే గ్యాస్ ఏజెన్సీలు కూడా నడుచుకోవాల్సి ఉంటుంది.

రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరాపై...
ఎల్‌పీజీ సిలిండర్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య ఉన్న బుకింగ్‌ గడువును 21 నుంచి 25 రోజులకు పెంచింది. సిలిండర్లకు కొరత ఏర్పడొచ్చన్న భయాలతో కొందరు ముందస్తుగా గ్యాస్‌ బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో సగటున 55 రోజులకోసారి సిలిండర్‌ బుక్‌ చేసుకునే వాళ్లు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో పదిహేను రోజులకే బుక్‌ చేస్తుండడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో 21 రోజుల లాకిన్‌ నిబంధన తీసుకొచ్చారు. తాజాగా ఆ గడువును ఇరవై ఐదు రోజులకు పెంచుతూ కేంద్ర పెట్రోలియం శాఖ అన్ని గ్యాస్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇరవై ఆరో రోజున మాత్రమే గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎల్‌పీజీ దిగుమతి కోసం...
ఇళ్లలో వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం ఇటీవల అరవై రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాణిజ్య సిలిండర్లపై114.50 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. చమురు సంస్థలు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగదారుల ఎల్‌పీజీ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, కమర్షియల్‌ వినియోగదారులకంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయిల్‌ రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఎల్‌పీజీ విక్రయానికి అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకొచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ అయితే పెట్రోలు, డీజిల్ పై ధరలు పెంచబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


Tags:    

Similar News