గిరిజన కూలీపై మూత్ర విసర్జన.. సీఎం కంటపడిన వీడియో

అయితే ఈ ఘటనపై ప్రతిపక్షాల ఆరోపణలు మరోలా ఉన్నాయి. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కేదార్..

Update: 2023-07-05 03:56 GMT

గిరిజన కూలీపై ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో వారంరోజుల క్రితం జరుగగా.. పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేస్తున్న ఆ వీడియో తాజాగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టిలో పడింది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పోలీసులు పర్వేష్ ను అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే ఈ ఘటనపై ప్రతిపక్షాల ఆరోపణలు మరోలా ఉన్నాయి. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి అని, అందుకే చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. నిందితుడు బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశాయి. ఈ ఆరోపణలను కేదార్ శుక్లా ఖండించారు. నిందితుడు తనకు ప్రతినిధి కాదని.. తెలిసిన వ్యక్తి మాత్రమేనని చెప్పుకొచ్చారు. నిందితుడి తండ్రి రమాకాంత్ శుక్లా మాత్రం తనకొడుకు పర్వేష్ ఎమ్మెల్యే కేదార్ ప్రతినిధేనని.. అందుకే తన కుమారుడిని టార్గెట్ చేశారని చెప్తుండటం కొసమెరుపు. పర్వేష్ చేసిన పని వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందన్నది నెటిజన్ల ప్రశ్న.


Tags:    

Similar News