టేకాఫ్ అవ్వడానికి కొద్ది క్షణాల ముందు విమానం ఇంజన్ లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా ప్రయాణీకులతో టెన్షన్ మొదలైంది. సకాలంలో గుర్తించి విమానం టేకాఫ్ అవ్వకుండా ఆపేశారు. బెంగళూరుకు బయలుదేరడానికి కొన్ని సెకన్ల ముందు శుక్రవారం రాత్రి ఇండిగో విమానం ఇంజన్‌లో ఒకదానిలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో నిలిపివేశారు. ఇండిగో విమానం 6E-2131లోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిర్‌బస్ ఏ-320 విమానంలో 184 మంది ఉన్నారు. రాత్రి 9:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు రాత్రి 11 గంటల తర్వాత విమానం నుంచి దిగి అర్ధరాత్రి సమయంలో మరో విమానంలో పయనమయ్యారు.
ప్రయాణీకులలో ఒకరైన ప్రియాంక కుమార్, ఈ సంఘటన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు, ఇందులో ఒక ఇంజిన్ మంటలలో చిక్కుకుని ఉండడం.. నిప్పురవ్వలు కనిపించడం గమనించవచ్చు. క్షణాల్లోనే మంటలు ఆరిపోయాయి. "విమానం ఐదు నుండి ఏడు సెకన్లలో టేకాఫ్ అయ్యేది. అకస్మాత్తుగా, రెక్కల నుండి భారీ నిప్పురవ్వలు రావడం చూశాను, అది పెద్ద మంటగా మారింది. వెంటనే విమానాన్ని నిలిపివేశారు. ఇంజిన్‌లో కొంత లోపం ఉందని పైలట్ మాకు తెలియజేశాడు." అని ప్రయాణీకులు తెలిపారు. మొదట్లో అందరూ భయపడ్డామని, కానీ సిబ్బంది మమ్మల్ని శాంతిపజేశారని ప్రయాణీకులు తెలిపారు. ఇండిగో ఒక ప్రకటనలో, "ఢిల్లీ నుండి బెంగుళూరుకు నడిచే విమానం 6E2131 టేకాఫ్ సమయంలో ఇంజిన్ నిలిచిపోయింది. టేకాఫ్ నిలిపివేయబడింది. విమానం సురక్షితంగా బేకి తిరిగి వచ్చింది." అని ఉంది.