అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు చెందిన ఖార్గ్ దీవి చమురు టెర్మినల్‌ను స్వాధీనం చేసుకునే అంశంపై బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ సోమవారం కూడా ఇస్లామిక్ రిపబ్లిక్‌పై దాడులు కొనసాగించాయి. మరోవైపు కాల్పుల విరమణ చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇక టెహ్రాన్ మాత్రం కువైట్‌లో కీలకమైన విద్యుత్, తాగునీటి శుద్ధి కేంద్రంపై దాడి చేసింది. గల్ఫ్ అరబ్ దేశాలపై లక్ష్యంగా పెట్టుకున్న తమ దాడుల భాగంగానే ఈ చర్య చేపట్టింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు సాగుతున్న తరుణంలో, హార్ముజ్ జలసంధి ద్వారా 20 చమురు ట్యాంకర్ల రాకపోకలకు ఇరాన్ అనుమతి ఇచ్చిందని ట్రంప్ తెలిపారు. ఇదే సమయంలో అమెరికా మెరైన్లను పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి తరలిస్తున్న నేపథ్యంలో ఖార్గ్ దీవిని స్వాధీనం చేసుకునే అవకాశాన్ని ప్రస్తావించారు.
అనేక మార్గాలున్నాయని...
“ఖార్గ్ దీవిని తీసుకోవచ్చు… తీసుకోకపోవచ్చు. మా వద్ద అనేక మార్గాలు ఉన్నాయి” అని ట్రంప్ ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ఇటీవల రోజుల్లో ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం సమీపంలో సైరన్‌లు మోగాయి. యెమెన్ నుంచి ప్రయోగించిన రెండు డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసిందని ఇజ్రాయెల్ వెల్లడించింది. హౌతి తిరుగుబాటుదారులు ఈ యుద్ధంలో చేరిన తర్వాత ఇదే మొదటి క్షిపణి దాడి. సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్‌పై ప్రయోగించిన ఐదు క్షిపణులను అడ్డుకుంది. బహ్రెయిన్‌లో క్షిపణి హెచ్చరికలు వినిపించాయి. దుబాయ్ ఆకాశంలో రక్షణ వ్యవస్థలు క్షిపణిని ధ్వంసం చేశాయి. కువైట్‌లో ఇరాన్ దాడితో విద్యుత్, నీటి శుద్ధి కేంద్రం దెబ్బతింది. ఒక కార్మికుడు మృతి చెందగా, 10 మంది సైనికులు గాయపడ్డారని అక్కడి ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది.
కొనసాగుతున్న దాడులు...
నీటి శుద్ధి కేంద్రాలు గల్ఫ్ దేశాలకు అత్యంత కీలకం. ఇలాంటి కేంద్రాన్ని ఇరాన్ గతంలో బహ్రెయిన్‌లో కూడా దెబ్బతీసింది. వీటి పనితీరుకు భారీ విద్యుత్ అవసరం ఉండటంతో విద్యుత్ కేంద్రాల పక్కనే ఏర్పాటు చేస్తారు. ఇజ్రాయెల్ మరోవైపు టెహ్రాన్‌లోని సైనిక మౌలిక వసతులపై దాడులు కొనసాగించింది. ఉత్తర ఇరాన్‌లోని తబ్రిజ్ పెట్రోకెమికల్ కేంద్రంపై కూడా దాడి జరిగినట్లు అక్కడి మీడియా తెలిపింది. ప్రమాదకర పదార్థాల లీకేజీ జరగలేదని పేర్కొంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ భూదాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ ప్రాంతంలోని ఒక గ్రామం వద్ద పేలుడు సంభవించి ఇండోనేషియా శాంతి దళ సైనికుడు మరణించాడు. ముగ్గురు గాయపడ్డారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వారాంతంలో సైనిక చర్యలు విస్తరించనున్నట్లు తెలిపారు. దక్షిణ లెబనాన్‌లో భద్రతా మండలాన్ని పెంచుతామని ప్రకటించారు.
చమురు ధరలు పైపైకి...
ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. ఇరాన్ ఆ మార్గాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యం కలిగి ఉండటంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 115 డాలర్లకు చేరింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 60 శాతం పెరిగింది. అమెరికా ఈ ఘర్షణ ముగింపుకు 15 అంశాల ప్రణాళికను ఇరాన్‌కు అందించింది. హార్ముజ్ మార్గాన్ని తెరవాలని అందులో సూచించింది. దీనికి ప్రతిగా ఇరాన్ ఐదు అంశాల ప్రతిపాదనను ఇచ్చింది. పాకిస్తాన్ త్వరలో అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ చర్చలు ప్రత్యక్షమా, పరోక్షమా అన్నది స్పష్టత లేదు.ట్రంప్ మాట్లాడుతూ, “మేము ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చలు జరుపుతున్నాం. చర్చలు బాగా సాగుతున్నాయి. కానీ ఇరాన్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్త అవసరం” అని తెలిపారు.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఖలీబాఫ్ మాత్రం ఈ చర్చలను నమ్మదగ్గవిగా లేవని పేర్కొన్నారు. అమెరికా సైన్యం నేలపైకి వస్తే తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించారు.
మృతుల సంఖ్య కూడా...
లెబనాన్‌లో 1,200 మందికి పైగా మృతి చెందగా, 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఇరాన్‌లో 1,900 మందికి పైగా మృతి చెందారు. ఇజ్రాయెల్‌లో 19 మంది మరణించారు. ఇరాక్‌లో భద్రతా దళాల 80 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ దేశాల్లో 20 మంది మృతి చెందారు. వెస్ట్ బ్యాంక్‌లో నలుగురు చనిపోయారు. అమెరికా సైన్యంలో 13 మంది మరణించారు.