మంచులో చిక్కుకున్న పన్నెండు మందిని?
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో భారీగా మంచు కురుస్తుంది
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో భారీగా మంచు కురుస్తుంది. మంచులో చిక్కుకుపోయిన 12 మందిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా చోచ్రు గల్లా ప్రాంతంలో కొందరు స్థానికులు మంచులో చిక్కుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చోచ్రు గల్లా ప్రాంతానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంఘ్ పోలీస్ పోస్టుకు అత్యవసర సహాయం కోసం ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు, ఘటనా స్థలానికి బయలుదేరారు.
మూడు గంటలు శ్రమించి కాపాడిన పోలీసులు...
దట్టమైన మంచు, క్లిష్టమైన మార్గంలో సుమారు మూడు గంటల పాటు ప్రయాణించి, చిక్కుకుపోయిన వారి వద్దకు చేరుకున్నారు. పోలీసులు వృద్ధులను చేతులు పట్టుకుని సురక్షితంగా నడిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైనట్లు ఉధంపూర్ పోలీసులు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. "బసంత్‌గఢ్ ఎగువ ప్రాంతాలలో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన పన్నెండు మందిని ఉధంపూర్ పోలీసులు విజయవంతంగా రక్షించారు" అని పోస్ట్ చేశారు. బాధితులందరినీ పోలీస్ పోస్టుకు తరలించి, వారికి ఆహారం, ఆశ్రయం, వైద్య సహాయం అందించారు.