Tamil Nadu : చెన్నైలో భారీ వర్షం.. పాఠశాలలకు సెలవులు
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి. దీంతో చెన్నై జిల్లాలో బుధవారం అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ప్రకటించారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కడలూరు, విల్లుపురం, రాణిపేట జిల్లాల కలెక్టర్లు కూడా తమ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తూత్తుకుడిలో మాత్రం పాఠశాలలకు మాత్రమే సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు.
మెరీనా బీచ్ లో...
పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల పాలనాధికారులు కూడా బుధవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ నిర్ణయం నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల సూచనల నేపథ్యంలో తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, చెన్నైలోని ప్రసిద్ధ మెరీనా బీచ్ వద్ద సముద్రం ఉధృతంగా అల్లకల్లోలంగా మారింది. తీవ్రమైన గాలులతో కూడిన ఎత్తైన అలలు తీరాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితి మరో రెండు రోజులపాటు కొనసాగవచ్చని వాతావరణ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి భద్రతా సూచనలను పాటించాలని వారు సూచించారు.