అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని షాక్

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పోరాటం ఫలించలేదు.

Update: 2023-08-08 02:50 GMT

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పోరాటం ఫలించలేదు. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023ని సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసుల బిల్లుపై సభలో ఓటింగ్ జరగగా మద్దతుగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. మెజార్టీ రావడంతో ఢిల్లీ సర్వీసుల బిల్లు రాజ్యసభలో గట్టెక్కింది. ప్రతిపాదిత చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది. సర్వీస్ వ్యవహారాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి ఎగ్జిక్యూటివ్ అధికారాలను సుప్రీంకోర్టు ఇచ్చిన కొద్ది రోజులకే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని ఆప్ ఆరోపించింది. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్త పర్యటనకు వెళ్లినా అది సత్ఫలితాలను ఇవ్వలేదు.

తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, జనతాదళ్ యునైటెడ్, కాంగ్రెస్, భారత రాష్ట్రీయ సమితి (BRS), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)... ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటంలో AAPకి తమ మద్దతును అందించారు. ఈ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మద్దతు పలికాయి. బీఎస్పీ, బీజేడీ కూడా ఎన్డీయేకు అనుకూలంగా ఓటేశాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ నిర్వహించారు. ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభ సైతం ఆమోదం తెలిపింది. ఇరు సభలలో బిల్లుకు ఆమోదం రావడంతో ఇక రాష్ట్రపతికి బిల్లును పంపనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేస్తే ఢిల్లీ సర్వీసుల బిల్లు చట్టంగా మారనుంది. ఢిల్లీ సర్వీసుల బిల్లు అంశంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పును ఎవరూ ఉల్లంఘించలేదన్నారు. ఢిల్లీలో అవినీతి రహిత పాలనను అందించాలన్న లక్ష్యంతోనే ఈ సర్వీసుల బిల్లును తెచ్చామన్నారు. తమపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లును తొలిసారిగా తీసుకొచ్చారని గుర్తు చేశారు.


Tags:    

Similar News