నేడు జీ 23 నేతల సమావేశం
జీ 23 నేతల సమావేశం నేడు జరగనుంది. కాంగ్రెస్ అసంతృప్త నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమయింది. ఈ నేపథ్యంలో జీ 23 నేతల సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అసంతృప్త నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. వరసగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తున్నామని, దీనికి నాయకత్వ లోపమే కారణమని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. వీలయినంత త్వరగా పార్టీ అధ్యక్షుడిని నియమించాలని సీనియర్ నేతలు కోరుతున్నారు.
ఓటమికి బాధ్యులెవరు?
ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. శాశ్వత అధ్యక్షులు లేరు. రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత మరెవ్వరినీ నియమించలేదు. రాహుల్, ప్రియాంక గాంధీలే ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. ఓటమికి బాధ్యులెవరో తేల్చాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏఐసీసీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఈరోజు సమావేశమయ్యే జీ 23 నేతలు సోనియా గాంధీకి ఘాటుగానే లేఖరాయాలని నిర్ణయించుకున్నారు.