Cuba : క్యూబాలో విద్యుత్తు సంక్షోభం.. చమురు ఆంక్షలు

మిగెల్ డియాస్-కానెల్ బుధవారం కీలక ప్రకటన చేశారు

Update: 2026-03-26 01:47 GMT

Activists wave Cuban and Palestinian flags from the vessel Maguro, arriving from Mexico with humanitarian aid as part of the "Nuestra America," or Our America Convoy, in Havana Bay, Cuba,

మిగెల్ డియాస్-కానెల్ బుధవారం కీలక ప్రకటన చేశారు. క్యూబా, అమెరికా మధ్య జరుగుతున్న చర్చల్లో మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో కూడా భాగస్వామిగా ఉన్నారని వెల్లడించారు. ఈ చర్చలు ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నాయని చెప్పారు. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో చోటుచేసుకున్నాయి. చెడిపోతున్న విద్యుత్‌ గ్రిడ్‌ కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్‌ కోతలు కొనసాగుతున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న చమురు ఆంక్షల వల్ల క్యూబాకు ఇంధన సరఫరాలు నిలిచిపోయాయి. క్యూబాకు చమురు అందించే దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. త్వరలోనే “క్యూబాను స్వాధీనం చేసుకునే గౌరవం” తనకుంటుందని కూడా వ్యాఖ్యానించారు.

కాస్ట్రో అత్యంత ప్రభావశీల నేతగా...
డియాస్-కానెల్ స్పెయిన్ వామపక్ష నాయకుడు పాబ్లో ఇగ్లేసియాస్కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. గంటకు పైగా సాగిన ఈ ఇంటర్వ్యూను ఆయన నిర్వహించే క్రౌడ్‌ఫండెడ్‌ టీవీ చానల్ కెనాల్ రెడ్ ప్రసారం చేసింది. చర్చలను క్యూబా ప్రభుత్వం సమష్టిగా నిర్వహిస్తోందని తెలిపారు. 2018లో డియాస్-కానెల్ అధ్యక్షుడైనా, 94 ఏళ్ల రౌల్ కాస్ట్రో దేశంలో అత్యంత ప్రభావశీలుడిగానే ఉన్నారని చెప్పారు. “ఒక ఒప్పందానికి దారితీసే చర్చల ప్రక్రియ చాలా దీర్ఘకాలం సాగుతుంది. ముందుగా సంభాషణకు మార్గం ఏర్పడాలి. తర్వాత పరస్పర ప్రయోజనాల అజెండా రూపొందాలి. ఆ అజెండాపై ముందుకు వెళ్లాలనే సంకల్పాన్ని ఇరు పక్షాలు చూపాలి” అని డియాస్-కానెల్ వివరించారు.
రెండు సార్లు బ్లాక్ అవుట్...
గత జనవరిలో ట్రంప్, క్యూబాకు చమురు సరఫరా చేసే దేశాలపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ తరువాత ఆ హెచ్చరికను కొంత సడలించి నా, ఆంక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. గత మూడు నెలలుగా క్యూబాకు ఎలాంటి ఇంధన రవాణాలు చేరలేదు.దీంతో విద్యుత్‌ అంతరాయాలు తీవ్రంగా మారాయి. ఆర్థిక, సామాజిక వ్యవస్థలు దాదాపు స్తంభించిపోయాయి. గత వారం దేశవ్యాప్తంగా రెండుసార్లు బ్లాక్‌అవుట్‌ జరిగింది. లక్షలాది మంది విద్యుత్‌ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అమెరికా వర్గాలు కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలిపాయి. ట్రంప్, క్యూబాను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని మరోసారి హెచ్చరించారు. దీనిపై డియాస్-కానెల్ సమతూకంగా స్పందించారు. “మా అధికారులు, అమెరికా విదేశాంగ శాఖ అధికారులు ఇటీవల చర్చలు జరిపారు” అని మాత్రమే చెప్పారు.
కాస్ట్రో పాత్రపై వస్తున్న...
కాస్ట్రో పాత్రపై వస్తున్న ఊహాగానాలపై కూడా ఆయన స్పందించారు. “విప్లవ నాయకత్వంలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. ఈ చర్చలు జరిగితే ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై నేను, కాస్ట్రోతో పాటు పార్టీ, ప్రభుత్వం, రాష్ట్ర వ్యవస్థల ప్రతినిధులు మార్గనిర్దేశం చేస్తున్నారు” అని చెప్పారు. రౌల్ కాస్ట్రో తన బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, ప్రజల్లో అతనికి ఉన్న గౌరవం, చారిత్రక గుర్తింపు ఎంతో గొప్పదని డియాస్-కానెల్ వ్యాఖ్యానించారు. గతంలో కాస్ట్రో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో 2014లో చారిత్రాత్మక చర్చలు జరిపారు. ఆ చర్చల ఫలితంగా ఇరు దేశాలు రాయబార కార్యాలయాలను మళ్లీ ప్రారంభించి, దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. అయితే ట్రంప్ ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు.ఇక క్యూబాలో ఐక్యరాజ్యసమితి నివాస సమన్వయకర్త ఫ్రాన్సిస్కో పిచోన్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే మానవతా సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యుత్‌ సంక్షోభం, గత ఏడాది తుఫాన్ల నష్టం పూడ్చుకోవాలంటే 94 మిలియన్‌ డాలర్లు అవసరమని తెలిపారు.
శస్త్రచికిత్సలు నిలిచిపోయి...
విద్యుత్‌ గ్రిడ్‌ దెబ్బతినడం వల్ల 96 వేల మందికి శస్త్రచికిత్సలు ఆగిపోవచ్చని అంచనా వేశారు. వారిలో 11 వేల మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు. 30 వేల మంది పిల్లలు టీకా షెడ్యూల్‌ నుంచి వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై ఆధారపడుతున్న దాదాపు పది లక్షల మందికి నీరు అందడం కష్టమైందని తెలిపారు.క్యూబాకు అత్యవసరంగా ఇంధనం అవసరమని ఐరాస అధికారులు చెప్పారు. అలాగే పాఠశాలలు, ఆస్పత్రులు కొనసాగాలంటే సౌర విద్యుత్‌ ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని సూచించారు.“ప్రస్తుత పరిస్థితి కొనసాగి, దేశంలోని ఇంధన నిల్వలు పూర్తిగా తగ్గిపోతే ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉందని మేము భయపడుతున్నాం” అని పిచోన్ హెచ్చరించారు.


Tags:    

Similar News