అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజూ అదే మాట పునరుద్ఘాటించారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో మంగళవారం దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకోగా, ఇరాన్ మాత్రం కఠినంగా స్పందించింది. ఒకవైపు ఇస్లామిక్ రిపబ్లిక్‌పై వైమానిక దాడులు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ సహా ప్రాంతంలోని లక్ష్యాలను గురి చేసింది. ఇదిలా ఉండగా, మరిన్ని అమెరికా దళాలు మధ్యప్రాచ్యానికి సిద్ధమవుతున్నాయి. 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన కనీసం 1,000 మంది సైనికులను త్వరలో పంపించనున్నారు. ఇప్పటికే వేలాది మెరైన్లు ఆ ప్రాంతానికి తరలిపోతున్నారు.
చర్చలు లేవన్న ఇరాన్...
ఇరాన్ మాత్రం ఎలాంటి చర్చలు లేవని ఖండించింది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే గడువును ట్రంప్ వాయిదా వేశారు. ఈ కీలక మార్గంపై ఇరాన్ నియంత్రణ వల్ల అంతర్జాతీయ రవాణా దెబ్బతింది. ఇంధన ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది.పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చినా, “పూర్తి విజయం సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది” అని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు జరగాలంటే అనేక అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ క్షిపణి, అణు కార్యక్రమాలపై వాషింగ్టన్ లక్ష్యాలు ఇంకా క్లిష్టంగానే ఉన్నాయి. ఇరాన్ తరఫున ఎవరు చర్చలకు అధికారికంగా ముందుకు వస్తారో కూడా స్పష్టత లేదు. ఇజ్రాయెల్ నేతలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు కొనసాగిస్తామని ప్రకటించడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ట్రంప్ పాలనలోనే గతంలో రెండు సార్లు ఉన్నత స్థాయి చర్చల సమయంలో దాడులు జరగడంతో, అమెరికాపై ఇరాన్ అనుమానం కొనసాగుతోంది.
మరిన్ని దళాలు....
82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే మోహరించే దళంగా గుర్తింపు పొందింది. యుద్ధ పరిస్థితుల్లో కీలక ప్రాంతాలు, ఎయిర్‌ఫీల్డ్‌లను స్వాధీనం చేసుకునే శిక్షణ వీరికి ఉంది. మరోవైపు మెరైన్లు రాయబార కార్యాలయాల భద్రత, పౌరుల తరలింపు, విపత్తు సహాయ కార్యక్రమాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. ఇరాన్ చమురు వ్యవస్థకు కీలకమైన ఖార్గ్ దీవిని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందనే చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఆ దీవిపై అమెరికా దాడులు జరిపింది. అవసరమైతే సముద్రంలో మైన్లు వేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇదే సమయంలో చర్చలు కొనసాగుతున్నంత వరకు విద్యుత్ కేంద్రాలపై దాడి చేయబోమని ట్రంప్ తెలిపారు. ఇది మెరైన్లు చేరుకునే వరకు సమయం కొనుగోలు చేసే వ్యూహమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
చర్చలకు పాకిస్తాన్ ముందుకు..
ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు నిర్వహించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అమెరికా కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. అయితే ఇరాన్‌ను ఒప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని దౌత్యవర్గాలు చెబుతున్నాయి. అమెరికా తరఫున స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ట్రంప్ మాట్లాడుతూ “ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు కూడా ఒప్పందానికి ఆసక్తి ఉంది” అన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పలువురు నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అయితే ప్రత్యక్ష చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యను ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖండించారు. యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది.
దాడులు కొనసాగుతూనే...
ఇరాన్ ఉత్పత్తి కేంద్రాలపై విస్తృత దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఇరాన్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. పలువురు గాయపడ్డారు. గల్ఫ్ దేశాల్లో కూడా ఉద్రిక్తత పెరిగింది. బహ్రెయిన్‌లో ఇరాన్ దాడిలో ఒక వ్యక్తి మృతి చెందగా, కువైట్‌లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సౌదీ అరేబియా తనపై దాడి చేసిన డ్రోన్లను కూల్చివేసింది. లెబనాన్‌లోని బీరుట్ ఉపనగరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. హిజ్బుల్లా మౌలిక సదుపాయాలే లక్ష్యమని తెలిపింది. పలు ప్రాంతాల్లో ప్రాణనష్టం జరిగింది.లెబనాన్‌లో 1,000 మందికి పైగా మృతి చెందగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇరాన్‌లో మృతుల సంఖ్య 1,500 దాటింది. ఇజ్రాయెల్‌లో 16 మంది చనిపోయారు. అమెరికా సైనికుల్లో 13 మంది మరణించారు.